
హైదరాబాద్, వెలుగు: కరోనా, వరుస లాక్ డౌన్లతో సిటీలోని చాలా మంది డోర్డెలివరీలకు అలవాటు పడ్డారు. నేరుగా రైతు బజార్లకు వెళ్లి కూరగాయలు, పండ్లు కొనుక్కునేవాళ్లు తగ్గిపోయారు. వైరస్‌భయంతో ఇండ్లకు దగ్గర్లోని తోపుడు బండ్ల దగ్గర కొనడం, లేదా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టడం చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్అంటూ చాలా ప్రైవేటు మార్కెట్లు కూడా పుట్టుకొచ్చాయి. డెవివరీ బాయ్స్‌తో ఇంటికే పంపిస్తున్నాయి. రైతు బజార్లకు జనం తగ్గిపోయారు. దీంతో రైతు బజార్ల అధికారులు రూటు మార్చారు. మొబైల్ వ్యాన్ల ద్వారా నేరుగా ఇండ్ల ముందుకే కూరగాయలను పంపిస్తున్నారు. రైతులే పండించిన కూరగాయలు, పండ్లు తెచ్చి అమ్ముతుండడంతో జనం ఆదరిస్తున్నారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా డైలీ వందల క్వింటాళ్ల కూరగాయలు అమ్ముడవుతున్నాయి.
కరోనా టైంలో రైతులు మార్కెట్లకు తెచ్చిన సరుకు అమ్ముడుపోక చాలా ఇబ్బందులు పడ్డారు. కూరగాయలు కుళ్లిపోవడంతో పారబోసి ఇండ్లకు వెళ్లిన రోజులు కూడా అనేకం ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ రైతులే తమ కూరగాయలను మొబైల్ వెహికల్స్ ద్వారా డోర్ డెలివరీ చేయొచ్చని సూచించింది. ఈ ఆలోచనని నగరంలోని రైతుబజార్లు ఆచరించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం సిటీలో11 రీటైల్ రైతుబజార్లు ఉండగా వాటిలో 60 వరకు మొబైల్ వెహికిల్స్ ఉన్నాయి. రైతులు ఊర్ల నుంచి కూరగాయల తెచ్చే డీసీఎంలు, వ్యాన్‌లనే ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. ఐదారుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి ఆర్డర్ల వారీగా తమ వద్ద కూరగాయలతోపాటు ఇతర రైతుల నుంచి కూరగాయలు కొంటున్నారు. సిటీకి తెచ్చి అమ్ముతున్నారు.
రోజుకు రెండు, మూడు ఏరియాలు
రైతు బజార్ కు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మొబైల్ వ్యాన్ల ద్వారా కూరగాయలు అమ్ముతున్నారు. చుట్టుపక్కల గేటెడ్‌కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, కాలనీల నుంచి రైతు బజార్‌కు వస్తున్న మెయిల్స్, మెసేజ్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ కి ముందు నుంచే డోర్ డెలివరీ కోసం తమకు రిక్వెస్ట్‌లు వచ్చేవని, మెయిల్స్ పెట్టేవారని ఎర్రగడ్డ రైతు బజార్ ఎస్టేట్ మేనేజర్ రమేశ్తెలిపారు. మొబైల్ వెహికిల్స్ అందుబాటులోకి వచ్చాక ఆర్డర్లు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది, పదిన్నర నుంచి వెహికల్స్ఆయా ఏరియాలకు వెళ్లిపోతాయని తెలిపారు. రోజుకి రెండు, మూడు ఏరియాలను కవర్ చేస్తున్నామని చెప్పారు. అయితే నేరుగా ఇంటి దగ్గరకే తీసుకెళ్లి అమ్ముతుండడంతో ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కలిపి మార్కెట్ రేటు కంటే రూ.5 ఎక్కువ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ విధానంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. దళారుల బాధలేకుండా రైతులే తమ కూరగాయలను నేరుగా అమ్ముకుంటున్నారు. కస్టమర్లు నేరుగా వచ్చి తాజా కూరగాయలు కొనుక్కుంటున్నారు. మా రైతుబజార్లో 24 మొబైల్ వ్యాన్ లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకి 300 నుంచి 450 క్వింటాళ్ల కూరగాయలు అమ్ముడవుతున్నాయి. మాకు వస్తున్న రిక్వెస్ట్ ల ప్రకారం వెహికల్స్ పంపిస్తున్నాం. వారంలో ఏ రోజు పంపించాలో ముందే నిర్ణయించి పంపిస్తున్నాం. – రమేష్, ఎస్టేట్ మేనేజర్, ఎర్రగడ్డ రైతుబజార్