పోక్సో కేసులో నిందితుడికి 22 ఏండ్ల జైలు శిక్ష .. నల్గొండ జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నిందితుడికి 22 ఏండ్ల జైలు శిక్ష ..  నల్గొండ జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

మిర్యాలగూడ, వెలుగు: బాలికను నమ్మించి  లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 22 ఏండ్ల జైలు శిక్ష, రూ. 35 వేల జరిమానా విధిస్తూ నల్గొండ జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కేసు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన  అల్లం మహేశ్ 2013లో ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో  వాడపల్లి పీఎస్ లో ఐపీసీ 417,420 సెక్షన్లతో పాటు పోక్సో  కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

 అనంతరం పోలీసులు చార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల తర్వాత నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. నిందితునికి శిక్ష పడేలా వ్యవహరించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎస్ఐ వీర రాఘవులు, సీఐలు ప్రకాశ్, మహేశ్, నర్సింహా రెడ్డి, రవీందర్, ప్రస్తుత  మిర్యాలగూడ రూరల్ సీఐ ప్రసాద్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మరో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు..

సత్తుపల్లి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం రెండో ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి ఉమాదేవి  శుక్రవారం తీర్పు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన ఏడేండ్ల బాలిక 2023 ఆగస్టులో ఇంటి బయట ఆడుకుంటుండగా, అదే మండలంలోని కొత్తూరుకు చెందిన మామిడి పాపారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు పాపారావును అరెస్ట్ చేశారు. 

చార్జ్ షీట్ ను  కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం శుక్రవారం జడ్జి తీర్పు చెప్పారు.  పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ ఇర్షద్ వాదనలు వినిపించగా.. అప్పటి ఎంక్వైరీ ఆఫీసర్ ఏసీపీ రామానుజం, ఏసీపీ రఘు, ఇన్ స్పెక్టర్, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ రవి కుమార్, లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 
అభినందించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో టీచర్​పై.. 

మహబూబ్ నగర్ రూరల్: పాఠశాల విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ జడ్పీ హైస్కూల్​ఫిజికల్ సైన్స్ టీచర్ రామ్మోహన్ పదోతరగతి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా డు. దీంతో విద్యార్థినులు అదే స్కూల్​లోని మరో ఉపాధ్యాయుడు శంకర్ కు చెప్పుకుని వాపోయారు. సదరు టీచర్​ షీ టీమ్, రూరల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. టీచర్​రామ్మోహన్​పై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.