డీల్ కుదిరేనా..? జులై 9 లోగా భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం!

డీల్ కుదిరేనా..? జులై 9 లోగా భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం!
  • భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం..ఈ నెల 9లోపు కుదిరే అవకాశం
  • వ్యవసాయ, ఆటో రంగాల్లో సమస్యలు

న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం జులై 9 లోగా ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే, వ్యవసాయం, ఆటోమొబైల్ రంగాలలో కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. భారత బృందం వాషింగ్టన్ నుంచి తిరిగి వచ్చింది. చర్చలు కొనసాగుతాయని అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ సుంకాల 90 రోజుల సస్పెన్షన్ గడువు ఈ నెల తొమ్మిదిన ముగుస్తుంది. అంతకు ముందే ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు దేశాలు కోరుకుంటున్నాయి. 

తాము దిగుమతి చేసుకునే ఆటో విడిభాగాలపై అమెరికా 25 శాతం సుంకం విధించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థలో కూడా లేవనెత్తింది. డైరీ ఉత్పత్తులు, యాపిల్స్, ట్రీ నట్స్, జన్యుపరంగా మార్పు చేసిన పంటలు వంటి ఉత్పత్తులపై సుంకాల రాయితీలు ఇవ్వాలని అమెరికా కోరుతోంది.  

ఇది రాజకీయంగా సున్నితమైన రంగం కావడంతో భారత్ రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. డెయిరీ పరిశ్రమను ఏ ఎఫ్​టీఏలోనూ భారత్ చేర్చలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 2న అమెరికా భారత వస్తువులపై అదనంగా 26 శాతం సుంకం విధించినా, 90 రోజుల పాటు నిలిపివేసింది. ప్రస్తుతం 10 శాతం బేస్‌‌‌‌‌‌‌‌లైన్ సుంకం అమలులో ఉంది. అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తి మినహాయింపును భారత్ కోరుతోంది. 

కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్‌‌‌‌‌‌‌‌లు, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై సుంకాల రాయితీలను అమెరికా అడుగుతున్నది. దుస్తులు, రత్నాలు, నగలు, తోలు ఉత్పత్తులు,  ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి శ్రమ- ఆధారిత రంగాలకు సుంకాల రాయితీలను భారత్​ కోరుతోంది. 

2030 నాటికి  వాణిజ్యాన్ని ప్రస్తుత 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం, ఆటో విడిభాగాలపై అమెరికా సుంకాలను విధిస్తున్నందుకు ప్రతీకారంగా తామూ సుంకాలను వేస్తామని భారత్ శుక్రవారం ప్రతిపాదించింది.