సరిహద్దుల్లో కొన్ని వాహనాలకే ఎంట్రీ

సరిహద్దుల్లో కొన్ని వాహనాలకే ఎంట్రీ

కామారెడ్డి జిల్లా : కరోనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. జనతా కర్ఫ్యూ, కరోనా నిరోధక చర్యలపై ప్రధాని మోడీ శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇచ్చిన పిలుపు మేరకు ..రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలతో పాటు వ్యక్తగత పరిశుభ్రత అవసరం అని ట్రాఫిక్ పోలీసులతోనూ కరోనా నివారణకు కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ భయంకరమైన వైరస్ ను అడ్డుకునేందుకు శనివారం చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారిపై బందోబస్తు చేస్తోంది.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన .. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ వద్ద పోలీసులు, డాక్టర్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగిస్తున్న వారిని పూర్తిగా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సరిహద్దుల్లోని ప్రతి చెక్‌ పోస్టు దగ్గర రవాణా శాఖ నుంచి ఇన్‌ స్పెక్టర్‌ స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అక్కడే ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు.

తెలంగాణ సరిహద్దులను కలిపే రహదారుల్లో నిర్ణీత వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, మిగతా వాహనాల రాకపోకలను శనివారం నుంచి 31వ తేదీ వరకు నిషేధిస్తున్నట్లు తెలిపారు.  నిర్ణీత వాహనాల్లో పాలు, పెట్రోలు, డీజిల్‌, కాయగూరలు, మందులు, గ్యాస్‌ రవాణా వాహనాలు, అంబులెన్సులు ఉన్నాయి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి కోసం అతి తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతారు. అయితే ఈ వాహనాల్లో ప్రయాణించే వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి, వాహనాల్లో క్రిమిసంహారక మందులను చల్లుతారని, దేశ, రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజలు ఈ చర్యలకు సహకరించాలని చెబుతున్నారు అధికారులు.