న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం చైల్డ్ లేబర్ లేని మండలంగా దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ జి. అశోక్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ గా తాను 2001 అక్టోబర్ 2 న వేల్పూర్ ను రాష్ట్రంలోనే100 శాతం ఎలిమినేషన్ చైల్డ్ లేబర్ మండలంగా డిక్లైర్చేశానని, అప్పటి నుంచి అదే రికార్డు కొనసాగుతోందన్నారు. 20 ఏండ్ల సక్సెస్ కు గుర్తుగా వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్(వీవీజీఎన్ఎల్ఐ), ఢిల్లీలోని తెలంగాణ భవన్ సంయుక్తంగా మంగళవారం ఓ కార్యక్రమం నిర్వహించాయి. తెలంగాణ భవన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కే ఎం సాహ్నీ, అప్పటి నిజామాబాద్ కలెక్టర్, ప్రస్తుత నేషనల్ వాటర్ మిషన్ అడిషనల్ చార్జ్, మిషన్ డైరెక్టర్ జి అశోక్ కుమార్, యూపీఎస్సీ మెంబర్ సత్యవతి, కేంద్ర కార్మిక శాఖ మాజీ సెక్రటరీ అనంద బోస్, తెలంగాణ భవన్ ఆర్సీ గౌరవ్ ఉప్పల్, వీవీజీఎన్ఎల్ఐ డైరెక్టర్ డా. హెచ్ శ్రీనివాస్ లు పాల్గొని మాట్లాడారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ నెల 8 న నిజామాబాద్ వేల్పూర్ లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తర్వాత బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాలు, ర్యాలీలు, అవగాహన సదస్సులపై రూపొందించిన ‘ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ వీడియోను ప్లే చేశారు. వేల్పూర్ సక్సెస్ కు ప్రతిరూపంగా పేరున్న ఈ వీడియో కు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నంది అవార్డు దక్కింది.
