డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై పట్టు.. కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందేనంటున్న సర్కార్

డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై పట్టు.. కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందేనంటున్న సర్కార్
  • లేకుంటే చర్యలు తీసుకోవాలని యోచన
  • ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ రద్దు చేయాలంటున్న పేరెంట్స్‌‌
  • ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా యూజీసీ అనుమతులు
  • నేడు రివ్యూ చేయనున్న వైద్యారోగ్యశాఖ మంత్రి

హైదరాబాద్, వెలుగు: డీమ్డ్ యూనివర్సిటీల పేరిట ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు గండి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. డీమ్డ్‌‌‌‌ వర్సిటీలైనా, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకు రావాలని యోచిస్తున్నది. ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు, డీమ్డ్‌‌‌‌ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తున్నది. 

ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులను ఇదివరకే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ఇదే అంశంపై అధికారులతో మంత్రి బుధవారం రివ్యూ చేయనున్నారు. మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు ఇటీవలే యూజీసీ డీమ్డ్‌‌‌‌ యూనివర్సిటీగా అనుమతులు ఇచ్చింది. దీనివల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 ఎంబీబీఎస్ సీట్లు, వంద బీడీఎస్‌‌‌‌ సీట్లు మేనేజ్‌‌‌‌మెంట్ కోటాలోకి మారిపోయాయి. 

అపోలో, సీఎంఆర్ సహా మరో 4 కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం యూజీసీ వద్ద ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కాలేజీలకు కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే, సుమారు మరో 450 కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటాలోకి వెళ్లిపోతాయి. దీంతో నీట్‌‌‌‌లో మంచి మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే విద్యార్థి సంఘాలు, మెడికల్ స్టూడెంట్స్‌‌‌‌ అండ్ పేరెంట్స్ అసోసియేషన్లు యూజీసీకి తమ నిరసన తెలియజేశాయి. 

మల్లారెడ్డి కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌‌‌‌మెంట్ రద్దు చేయాలని మెడికల్ స్టూడెంట్స్, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రెండ్రోజుల క్రితమే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కలిసి వినతి పత్రం కూడా అందజేశారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌‌‌‌మెంట్ రద్దు చేస్తే, ఆయా హాస్పిటళ్లకు వెళ్లే పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. టీచింగ్ హాస్పిటళ్లకు సరిపడా పేషెంట్లు రాకపోతే, ఆయా కాలేజీల పర్మిషన్లను నేషనల్‌‌‌‌ మెడికల్ కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ రద్దు చేయాలని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎన్‌‌‌‌వోసీ లేకుండానే పర్మిషన్ ఎట్ల!

మెడికల్ కాలేజీలకు యూజీసీకి అసలు సంబంధం ఉండదని, కాలేజీల అనుమతులు, పర్యవేక్షణ వ్యవహారాలన్ని నేషనల్ మెడికల్ కమిషనే చూస్తుందని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా మెడికల్ కాలేజీ డీమ్డ్‌‌‌‌ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ కాలేజీ అప్పటికే అఫ్లియేట్ అయి ఉన్న యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. 

మల్లారెడ్డి కాలేజీలకు అసలు తాము ఎన్‌‌‌‌వోసీ ఇవ్వనేలేదని, ఎన్‌‌‌‌వోసీ లేకుండానే డీమ్డ్‌‌‌‌ హోదా తెచ్చుకున్నారని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటున్నారు. అలాగే, ఫీజుల విషయంలో ఎన్‌‌‌‌ఎంసీ నుంచి స్పష్టమైన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ఉన్నాయని, 50 శాతం సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే చార్జ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ రూల్స్​ఏవీ మల్లారెడ్డి కాలేజీ పాటించకపోవడం గమనార్హం. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, స్టూడెంట్లు ఎవరైనా ఈ విషయంలో కోర్టుకు వెళ్తే మల్లారెడ్డి కాలేజీల్లో అడ్మిషన్లు ఆగిపోతాయని అధికారులు చెబుతున్నారు.

నష్టపోతున్న మెరిట్ స్టూడెంట్లు

రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా, మల్లారెడ్డి కాలేజీలకు ప్రత్యేక (డిస్టింక్ట్‌‌‌‌) కేటగిరీ కింద డీమ్డ్ హోదా ఇస్తూ యూజీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఆయా కాలేజీల్లో కన్వీనర్ కోటా, రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేకుండా అనుమతులు జారీ చేసింది. ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యంకనం వంటివన్నీ యూనివర్సిటీ హోదాలో సొంతగానే చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. 

తెలంగాణ లోకల్‌‌‌‌ కోటా అమలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్న 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 200 బీడీఎస్‌‌‌‌(డెంటల్) సీట్లు పూర్తిగా మేనేజ్‌‌‌‌మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి. గతేడాది వరకూ ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్‌‌‌‌లో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్స్‌‌‌‌కు ఈ సీట్లు దక్కేవి. మెరిట్ ర్యాంకు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. 

మేనేజ్‌‌‌‌మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించేవారు. కానీ, ఇకపై ఈ రూల్స్‌‌‌‌ ఏవీ అమలు చేయాల్సిన అవసరం లేకుండా యూజీసీ మల్లారెడ్డికి మినహాయింపులు ఇచ్చింది. మల్లారెడ్డి చూపిన బాటలో ఇతర కాలేజీలు కూడా డీమ్డ్​ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కన్వీనర్ కోటా, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.