శ్రీవారి భక్తులకు అలర్ట్: టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్.. మెసేజ్ లలో డబ్బులు అడుగుతున్న కేటుగాళ్లు

శ్రీవారి భక్తులకు అలర్ట్: టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్.. మెసేజ్ లలో డబ్బులు అడుగుతున్న కేటుగాళ్లు

ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్స్... అమాయకుల నుండి డబ్బులు దండుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న మార్గాల్లో ఇదొకటి. మన పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి.. మన ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు కేటుగాళ్లు. తెలిసినవాళ్ళే కదా అని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాం. ఆ తర్వాత అవతల వ్యక్తి నుండి మెసేజ్ లు మొదలవుతాయి... ఆపదలో ఉన్నాను, డబ్బులు కావాలి అంటూ మెసేజ్ లు పంపి అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటారు కేటుగాళ్లు. ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.. ఫేక్ అకౌంట్ నుండి మెసేజ్ లు పంపి డబ్బులు అడుగుతున్నారని... భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది టీటీడీ.

టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు పేరుతో ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని టీటీడీ దృష్టికి వచ్చిందని... ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించడం జరిగిందని పేర్కొంది టీటీడీ.భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని కోరింది టీటీడీ.

ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నెం: 9866898630. లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెం: 18004254141 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరింది టీటీడీ.భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.