
- ఇప్పటిదాకా 200 మంది దాకా బదిలీ!
- హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకే ఎక్కువ మంది
- మరో వంద మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు ?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ టీచర్ల డిప్యూటేషన్ల జోరు మొదలైంది. వచ్చే విద్యాసంవత్సరానికి ఇప్పటి నుంచే కొందరు టీచర్లు గుట్టుగా ఆర్డర్లు తీసుకుంటున్నారు. సెక్రటేరియెట్ నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీచేస్తున్నారు. డిప్యూటేషన్లు పొందిన టీచర్లలో హైదరాబాద్ సిటీ చుట్టు పక్కలకు వస్తున్న వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. డిప్యూటేషన్లు ఇవ్వొద్దని టీచర్ల సంఘాలు మొత్తుకుంటున్నా.. కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహంతో వందలాది ఆర్డర్లు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
సెక్రటేరియెట్లోని ఉన్నతాధికారి ఇచ్చే లిస్ట్ ఆధారంగా..
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి సరిగ్గా నెల టైమ్ ఉంది. అయితే, ఇప్పటి నుంచే కొందరు టీచర్లు తమకు నచ్చిన జిల్లాలకు, మండలాలకు డిప్యూటేషన్లు వేయించుకుంటున్నారు. ఇప్పటిదాకా సుమారు 180 నుంచి 200 వరకు టీచర్ల డిప్యూటేషన్లు జరిగినట్టు తెలుస్తున్నది. దీంట్లో సగానికి పైగా గతేడాది కొనసాగిన డిప్యూటేషన్లకు మరో ఏడాది ఇవ్వగా, మిగిలిన వాళ్లకు కొత్తగా ఇచ్చారు. ఇవే కాక కొత్తగా మరో వంద వరకు డిప్యూటేషన్లు ఇచ్చేందుకు సెక్రటేరియెట్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్టు సమాచారం.
డిప్యూటేషన్లు ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ తదితర జిల్లాలకు చేశారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ద్వారా డిప్యూటేషన్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటేషన్ల ప్రక్రియలో విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్కారు పెద్దలు ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు టీచర్లకు డిప్యూటేషన్లు ఇవ్వాలని సూచిస్తే.. వాళ్లు మరిన్ని జత చేసి ఆర్డర్లు ఇస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ కమ్రంలో సెక్రటేరియెట్లోని ఉన్నతాధికారి నుంచి వచ్చే లిస్టుల ఆధారంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు డిప్యూటేషన్ ఉత్తర్వులు ఇస్తున్నారు.
ముందుగానే డిప్యూటేషన్లు..
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరం మేరకు టీచర్లను డిప్యూటేషన్‌పై పంపిస్తుంటారు. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఉత్తర్వులు వస్తున్నాయి.2025–26 విద్యాసంవత్సరం ప్రారంభం రోజు జూన్ 12 నుంచి ఆర్డర్లు అమల్లోకి వచ్చేలా ముందుస్తు ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. దీంతో డిప్యూటేషన్లపై వెళ్లిన బడుల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత కరువైంది.
నిరుడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్క్ అడ్జెస్ట్ మెంట్ పేరుతో ఏకంగా 3 వేల మంది టీచర్లకు డిప్యూటేషన్లు ఇచ్చారు. ఇది అధికారికంగా నిర్వహించారు. ఇప్పుడు అవేవీ లేకపోవడం గమనార్హం. ఇటీవల విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణాతో జరిగిన టీచర్ల సంఘాల సమావేశంలోనూ డిప్యూటేషన్లు ఇవ్వొదని ముక్తకంఠంతో కోరినా.. విద్యాశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు బడులను బాగు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా.. కొందరు ఉన్నతాధికారుల తీరుతో సర్కారుకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.