పంజాగుట్ట, వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నివాసముంటున్న పేదలకు తక్షణమే న్యాయం చేయాలని వెలుగుమట్ల భూదాన్ భూముల సాధన సమితి అధ్యక్షుడు కొల్లు వెంకటేశ్వర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు.
మొత్తం 729 మంది లబ్ధిదారులకు గాను కేవలం 212 మందికి పట్టాలు ఇచ్చి, మిగిలిన వారిని అనర్హులుగా ప్రకటించడం వెనుక స్థానిక నేతల కుట్ర ఉందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉండటంతో ఆ స్థలాలపై కన్నేసిన కొందరు నాయకులు.. అధికారులతో కుమ్మక్కై పేదలను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. గ్రామీణ పేదల సంఘం, ప్రభుత్వ అధికారులు కలిసి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

