వేములవాడ రాజన్న ప్రసాదంగా కోడెల పంపిణీ : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ రాజన్న ప్రసాదంగా కోడెల పంపిణీ : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  • ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  •     వేములవాడలో 45 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

వేములవాడ, వెలుగు: రైతులకు రాజన్న ప్రసాదంగా కోడెలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెలను సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి ప్రారంభించారు. పలువురు రైతులకు 193 జతల కోడెలను తిప్పాపూర్​ గోశాల నుంచి అందజేశారు. ఈ సందర్భంగా విప్​ మాట్లాడుతూ.. కోడెలను గతంలో స్వచ్ఛంద సంస్థలకు అందించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, దీంతో నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులకు అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్న రైతులను ఎంపిక చేసి అందిస్తున్నట్లు చెప్పారు. పాలు మరువని, జెర్సీ జాతి కోడెలను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అందించిన కోడెలను జాగ్రత్తగా చూసుకోవాలని.. దేవాదాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు. వేములవాడలో 45 ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్​పర్సన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేశ్, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీవో కేఎస్ బీ కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, తహసీల్దార్ జయంత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.