
- అమ్మవారికి మొక్కులు చెల్లించి, ఒడి బియ్యం సమర్పణ
వేములవాడ, వెలుగు : శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా వేములవాడ టౌన్ లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి శుక్రవారం మహిళా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్ లో నిల్చున్నారు. మొక్కులు చెల్లించుకుని ఒడి బియ్యం సమర్పించారు. కుటుంబమంతా బాగుండాలని వేడుకున్నారు. మంగళహారతులతో కుంకుమార్చనలు నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు చతుష్టోపచార పూజలు వేదమంత్రాలతో నిర్వహించారు. ఆలయాన్ని ఈఓ రాధాబాయి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పర్యవేక్షకుడు గూడెపు వెంకట ప్రసాద్, ఆలయ ఇన్‌స్పెక్టర్ మరిపెల్లి లక్ష్మీనారాయణ, ఆలయ సిబ్బంది ఉన్నారు.