ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు..దాన్ని శాశ్వతంగా తుదముట్టించాల్సిందే: వెంకయ్యనాయుడు

ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు..దాన్ని శాశ్వతంగా తుదముట్టించాల్సిందే: వెంకయ్యనాయుడు

హైదరాబాద్, వెలుగు: ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు అని,  ఇది ప్రపంచ సమస్య అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుదముట్టించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదివారం బ్రిటన్​రాజధాని లండన్  వీహెచ్ పీ హిందూ సెంటర్​లో బ్రిటిష్- భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్యనాయుడు చీఫ్​ గెస్ట్​గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని పేర్కొన్నారు.

మతం పేరు అడిగిమరీ అమాయకులను కాల్చి చంపడం దారుణమన్నారు.  భారత అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటూ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నదని, ఆ దేశం ప్రోత్సాహంతోనే పహల్గాంలో ఉగ్రవాదులు దుస్సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. దీనికి ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో  భారత ఆర్మీ .. పాకిస్తాన్​లోని 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిందని చెప్పారు.

 ‘‘ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. ఇది 145 కోట్ల మంది భారతీయుల సంకల్పం, ఐక్యతకు నిదర్శనం. దేశం యావత్తు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తిరంగా యాత్రలు నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించారు. సైన్యం వెంటే మేం అని చాటి చెప్పారు. ఉగ్రవాద భరతం పట్టే భారతం ఇది”  అని వ్యాఖ్యానించారు. 

మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి

ఉగ్రవాదానికి భారత్ మాత్రమే కాదు.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలన్నీ బాధిత దేశాలే అని వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్మీయులైన తెలుగువారందరినీ బ్రిటన్ లో  కలుసుకోవడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా మన కల్చర్​ను పరిరక్షించుకోవాలని సూచించారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్- భారత తెలుగు సంస్కృతి సంఘం వ్యవస్థాపక చైర్మన్ సురేశ్​ మాట్లాడారు.