- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
హైదరాబాద్/గండిపేట, వెలుగు: రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని తాను ఇష్టపడనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు వేరైనా మన మూలం తెలుగేనని, ఏమైనా సమస్యలుంటే కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఆకాంక్షను రెండు రాష్ట్రాల సీఎంలు వ్యక్తం చేయడం సంతోషకరమన్నారు.
హైదరాబాద్‌లాగే ఏపీ రాజధాని అమరావతి కూడా వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు, ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. కాగా, సంక్రాంతి పండుగకు సీఎం నుంచి సామాన్యుడి దాకా సొంతూళ్లకు వెళ్లే గొప్ప సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
