గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయాలి

గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయాలి

హైదరాబాద్, వెలుగు: గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని ఎన్​ఎస్​యూఐ స్టేట్​ప్రెసిడెంట్ ​బల్మూరి వెంకట్​ డిమాండ్​ చేశారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్స్​ ఉన్నాయని, ఆ తర్వాత వెంటనే గ్రూప్–2 పరీక్ష నిర్వహించడం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులొస్తాయని ఆయన పేర్కొన్నారు. గురుకుల ఎగ్జామ్​ అయిపోయిన వారం రోజుల్లోపే గ్రూప్​–2 పెట్టడం వల్ల ప్రిపరేషన్​కు అభ్యర్థులకు టైం ఉండకుండా పోతుందని చెప్పారు. శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. 

ఈ మేరకు తాము టీఎస్​పీఎస్సీకి లేఖలు రాస్తామని చెప్పారు. పరీక్షను వాయిదా వేయాలన్న వారిపై ప్రభుత్వం కేసులు పెడుతూ బెదిరిస్తున్నదని ఫైర్​అయ్యారు. మరోవైపు గురుకుల ఎగ్జామ్​ సెంటర్లు అభ్యర్థులకు ఇబ్బందిగా మారాయని వెంకట్​ ఆరోపించారు. 3 పేపర్లకు 3 సెంటర్లలో పరీక్షలు పెట్టడమేందని ఆయన ప్రశ్నించారు. గతంలో ఒకే సెంటర్​ ఉండేదని, ఇప్పుడు ఆన్​లైన్​ ఎగ్జామ్​ పేరిట ఒకే అభ్యర్థికి మూడు సెంటర్లలో పరీక్షలు పెడుతున్నారని అన్నారు. మహిళా అభ్యర్థులు సహా అభ్యర్థులందరికీ ఈ విధానంతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని వాపోయారు. ఒకవేళ 3 సెంటర్లలో పరీక్షను నిర్వహించాలనుకుంటే కనీసం ఎగ్జామ్​, ఎగ్జామ్​కి మధ్య గ్యాప్​నైనా పెంచాలని ఆయన డిమాండ్​ చేశారు.