
- రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్
హుజురాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల విముక్తి కోసం పాటతోపాటు తూటాను మోస్తూ ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్, గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ అన్నారు. శుక్రవారం గద్దర్ ద్వితీయ వర్ధంతి సభను శనిగరం బాబ్జి ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గద్దర్ ఫొటో వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెన్నెల మాట్లాడుతూ గద్దర్ ఆశ, ఆశయం సమసమాజ నిర్మాణమని, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటాలు చేశారన్నారు. ఓయూ విద్యార్థి నుంచి జన నాట్యమండలి సాంస్కృతిక సేనానిగా ఎదిగిన ఆయన పాటను ఆయుధంగా ఎక్కుపెట్టి ప్రజా ఉద్యమాలు నిర్మించారన్నారు.
కార్యక్రమంలో కవి, సీనియర్ జర్నలిస్టు అవునూరి సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు జీడీ సారయ్య, మాజీ మావోయిస్టు నేత హుస్సేన్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర రాజు, హెచ్‌ఆర్ఎఫ్ అధ్యక్షుడు తిరుపతయ్య, మురళీ మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాములు, తిరుపతయ్య, పాల్గొన్నారు.