న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని జహీరాబాద్ ఎంపీ సీటు పరిధిలోని 20 పోలింగ్ స్టేషన్లలో వాడిన ఈవీఎం (ఓటింగ్ మెషీన్లు)లను వెరిఫికేషన్ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వెల్లడించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్ లో ఏడు, జహీరాబాద్లో 7, ఆందోల్(ఎస్సీ)లో 6 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది. ఎక్కడైనా రెండు లేదా మూడో స్థానంలో ఉన్న అభ్యర్థులకు సందేహం ఉంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోపు ఈసీకి ఫిర్యాదు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీంతో దేశవ్యాప్తంగా 11 చోట్ల ఈవీఎం తనిఖీ లేదా వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని ఈసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 8 లోక్ సభ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాల్లో, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. ఏపీలోని విజయనగరం లోక్ సభ పరిధిలో 2, బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం వైసీపీ దరఖాస్తు చేసింది. ఒడిశాలో 13, మిగతా దరఖాస్తులు చత్తీస్గఢ్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చాయి.
