BSarojaDevi: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘దాన వీర శూర కర్ణ’ నటి బి. సరోజాదేవి కన్నుమూత

BSarojaDevi: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘దాన వీర శూర కర్ణ’ నటి బి. సరోజాదేవి కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు (జూలై14న) ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

సరోజాదేవి 1938లో బెంగుళూరులో జన్మించింది. అయినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె తన సినీ కెరీర్లో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించింది.

2009లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఆమెను వరించింది. సరోజాదేవి సినిమా రంగానికి చేసిన సేవలకుగానూ కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇకపోతే, (జూలై 13న) విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే.

సరోజాదేవి సినీ ప్రస్థానం:

1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పాండురంగ మహత్యం (1957) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత ఎక్కువగా ఎన్టీఆర్, ఎ. ఎన్. ఆర్ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. హిందీలో దిలీప్ కుమార్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, తమిళంలో ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్ వంటి స్టార్స్ తో నటించి ఎన్నో ప్రశంసలు అందుకుంది. 

పాండురంగ మహత్యం (1957), భూకైలాస్ (1958),పెళ్ళి సందడి (1959), పెళ్ళి కానుక (1960), సీతారామ కళ్యాణం (1961), జగదేకవీరునికథ (1961), ఇంటికి దీపం ఇల్లాలే (1961), మంచి చెడు (1963), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), దాగుడు మూతలు (1964), ఆత్మబలం (1964), అమరశిల్పి జక్కన్న(1964), శ్రీరామాంజనేయ యుద్ధం (1975), దాన వీర శూర కర్ణ (1978) వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపుపొందింది.