న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలని, జిహాదీలు దేశంలోకి చొరబడకుండా చూడాలని కేంద్రానికి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) విజ్ఞప్తి చేసింది. వీహెచ్ పీ మధ్య భారత్ సెక్రటరీ రాజేష్ జైన్ గురువారం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్ లో హిందువులను ఊచకోత కోస్తున్నారు. ఇండ్లు, దుకాణాలను దోచుకుంటున్నారు. మహిళలపై అత్యాచారాలు చేసి చంపుతున్నారు. గుడులను ధ్వంసం చేస్తున్నారు.
వెంటనే అక్కడి హిందువులను కాపాడాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అలాగే, బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద కాపలా కాస్తున్న ఆర్మీ, బీఎస్ఎఫ్ కు ప్రతి వీహెచ్ పీ కార్యకర్త అండగా ఉండాలి” అని రాజేష్ పేర్కొన్నారు. కాగా.. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను వ్యతిరేకిస్తూ ఉత్తర ప్రదేశ్ లో రైట్ వింగ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు.
బంగ్లాదేశ్ లో హింసను ఎదుర్కోలేక భారత్ కు వచ్చిన వారికి వెంటనే మన దేశ పౌరసత్వం ఇవ్వాలని, ఆ దేశంలో ఉంటున్న హిందువులకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ సంక్షోభంపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ గురువారం బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఫోన్ లో మాట్లాడారు. కాగా.. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియన్ వీసా సెంటర్లను నిరవధికంగా బంద్ చేశారు.
భారత్ కు మరో 17 మంది ఇండియన్ వర్కర్లు
బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన 17 మంది ఇండియన్ రోడ్డు నిర్మాణ కార్మికులు భారత్ కు సురక్షితంగా తిరిగివచ్చారు. అగర్తల నుంచి బంగ్లాదేశ్ లోని కిశోర్ గంజ్ వరకు 52 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు ఆఫ్కాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ 17 మంది కార్మికులను నియమించుకుంది. వారు బంగ్లాదేశ్ లో చిక్కకుపోగా గురువారం బీఎస్ఎఫ్ సాయంతో స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చారు.
