హైదరాబాద్, వెలుగు: వొడాఫోన్ ఐడియా (వీఐ) కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సంస్థ.. ట్రాయ్ డేటా ఆధారంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రతి ఐదుగురు వీఐ వినియోగదారుల్లో ఒకరు ఇనాక్టివ్‌గా ఉన్నారు. 2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో తమ సంఖ్య కస్టమర్ల సంఖ్య 19.72 కోట్లు ఉందని వీఐ ప్రకటించింది. వీరిలో యాక్టివ్ యూజర్లు 15.47 కోట్లేనని రిపోర్ట్ తెలిపింది.
ఇనాక్టివ్ యూజర్లను తొలగించి, తక్కువ ఆదాయం వచ్చే ఎం2ఎం సిమ్‌లను మినహాయిస్తే వీఐ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్‌పీయూ) రూ.167 నుంచి రూ.209కి పెరుగుతుందని పేర్కొంది. జియో ఏఆర్‌పీయూ రూ.220గా ఉంది. వాయిస్ విభాగంలోనూ వీఐ బలహీనంగా ఉంది. ట్రాయ్ అక్టోబర్ డేటా ప్రకారం యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల వాయిస్ వినియోగం నెలకు 746 నిమిషాలు. ఎయిర్‌టెల్‌లో ఇది 1,071 నిమిషాలు, జియోలో 1,105 నిమిషాలు ఉన్నాయి. అక్టోబర్‌లో వీఐని 20.8 లక్షల మంది కస్టమర్లు విడిచిపెట్టారు.

