మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమానత్వం

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమానత్వం

హైదరాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే స్త్రీ, పురుష సమానత్వం సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్​లోని పి.ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌, దస్​పల్లా హోటల్​లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ… ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు చూడగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందినట్లని అన్నారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పించి, వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ దిశగా ప్రభుత్వాలు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యూచరిస్టిక్ సిటీస్ సంస్థ ఆధ్వర్యంలో దస్​పల్లా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కరుణ గోపాల్, ఓబుల్ రెడ్డి స్కూల్ లో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ఎస్‌వీ రావు, ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు ఉషారెడ్డి పాల్గొన్నారు.