మిషన్ భగీరథ ట్యాంక్.. ప్రైవేట్ ప్లాట్‌లో కట్టిన్రు

మిషన్ భగీరథ ట్యాంక్..  ప్రైవేట్ ప్లాట్‌లో కట్టిన్రు
  • బిడ్డ పెండ్లి కోసం కొన్న స్థలాన్ని కబ్జా చేసిన్రని బాధితుడి ఆవేదన
  • కలెక్టర్, సీఎంవోకు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలే
  • ఫోన్ లో సంప్రదించినా స్పందించని ఎంపీడీఓ,మిషన్ భగీరథ డీఈ 

ఎల్ బీ నగర్ (హైదరాబాద్), వెలుగుఅక్రమాలు అడ్డుకోవాల్సిన అధికారులే స్థలం కబ్జా చేశారు. ప్రైవేట్ ప్లాట్ లో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మించారు. ఇదేంటని ప్లాట్ ఓనర్ ప్రశ్నిస్తే, జవాబు చెప్తలేరు. కలెక్టర్, సీఎం ఆఫీస్ కు కంప్లయింట్ చేసినా పట్టించుకుంటలేరు. హైదరాబాద్ కొత్తపేట్ లో నివసించే కె.ఫణీంద్ర.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామ పరిధిలోని సింగరేణి ఎంప్లాయీస్ కాలనీలో 200 గజాల ప్లాట్ ను 2017లో కొన్నారు. మూడేండ్ల క్రితం అధికారులు అందులో మిషన్ భగీరథ ట్యాంక్ కట్టాలని ప్రయత్నించగా ఆయన అడ్డుకున్నారు. 2019 లో మళ్లీ పనులు ప్రారంభించారు. ఆ టైమ్ లో ఫణీంద్రకు యాక్సిడెంట్ లో కాలు విరిగింది. దీంతో ఏడాది ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఫణీంద్ర ప్లాట్ వైపు వెళ్లకపోవడంతో అధికారులు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఫణింద్ర అక్కడికి వెళ్లేసరికి, అప్పటికే సగం పనులు అయిపోయాయి. దీనిపై సర్పంచ్ ను నిలదీయగా, తనకేం తెలియదని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను అడగాలని చెప్పాడు. ఓవైపు ఫణీంద్ర ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతుండగా, మరోవైపు అధికారులు ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసేశారు.

సీఎంఓ కూడా పట్టించుకుంటలే…

బాధితుడు జిల్లా కలెక్టర్ కార్యాలయం, సీఎం ఆఫీసులో కంప్లయింట్ చేసినా పట్టించుకుంటలేరు. ప్రభుత్వమే ఇట్ల ప్లాట్ కబ్జా చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఫణీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ పెండ్లి కోసం కొన్న ప్లాట్ ను కబ్జా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. లాక్ డౌన్ లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగం పోయిందని, 53 ఏండ్ల వయసులో జాబ్ కోసం వెతుకుతున్నానని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై లోకల్ ఎం‌‌‌‌‌‌‌‌పీడీ‌‌‌‌‌‌‌‌ఓ, మిషన్ భగీరథ డీఈని వివరణ కోరేందుకు ఫోన్ లో సంప్రదించినా స్పందించలేదు.