కరీంనగర్, వెలుగు: ఉపాధి కోసం మాలి దేశానికి వెళ్లి కిడ్నాప్ అయిన ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులను తీవ్రవాదుల చెరనుంచి విడిపించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను బాధితుల కుటుంబ సభ్యులు కోరారు. శనివారం కరీంనగర్ లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. యాదాద్రి జిల్లా బండ సోమారం గ్రామానికి చెందిన నల్లమాసు ప్రవీణ్ రెడ్డి, ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కుమారాకుల రామచంద్ర ఉపాధి కోసం మాలి దేశానికి వెళ్లారు.
అక్కడ రూబీ కంపెనీలో ఏడాదిగా జాబ్ చేస్తున్నారు. గత నవంబర్ 23న ప్రవీణ్, రామచంద్రను జేఎన్ఎం తీవ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది. ఇప్పటి వరకు వారి ఆచూకీ లేదు. 15 రోజులు దాటినా ఆ దేశ ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు. మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కిడ్నాపర్ల చెర నుంచి ఇద్దరు యువకులను విడిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
