కన్నీరు పెట్టిన వరంగల్​ మెగా టెక్స్​టైల్​ పార్కు బాధితులు

కన్నీరు పెట్టిన వరంగల్​ మెగా టెక్స్​టైల్​ పార్కు బాధితులు

వరంగల్/సంగెం, వెలుగు:  ‘మెగా టెక్స్​టైల్‍ పార్క్ కోసం అధికారులు గతంలోనే మా భూములు బలవంతంగా గుంజుకుని అన్యాయం చేసిన్రు. లోకల్‍ ఎమ్మెల్యే చెప్పిండని అడిగినకాడికి పచ్చని భూములిచ్చినం. పార్కుకు ఇచ్చిన భూముల వరకు అప్పుడే గోడలు కట్టుకున్రు. భవిష్యత్తులో మిగతా భూముల జోలికి రామంటే నమ్మినం. ఇప్పుడేమో మిగతావి కూడా ఇవ్వాలంటూ దౌర్జన్యం చేస్తున్రు. ఇదెక్కడి న్యాయం?’ అంటూ వరంగల్‍ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్ కోసం భూములిచ్చిన గీసుగొండ మండలం శాయంపేట రైతులు బావురుమన్నారు. అడుగడుగున పోలీస్‍ బందోబస్తు మధ్య రెవెన్యూ, ఇండస్ట్రీయల్‍ శాఖల అధికారులు శనివారం బలవంతంగా పచ్చని పంట పొలాల్లో డిజిటల్‍ సర్వే చేపట్టారు. ఎక్కడికక్కడ రైతులను అడ్డుకున్నారు. మహిళలు, వృద్ధులని సైతం చూడకుండా రైతులందరిని వ్యాన్లలో పోలీస్‍ స్టేషన్‍ కు తరలించారు. 

పంటపొలాల చుట్టూ పోలీసులే.. 

గ్రేటర్‍ వరంగల్‍ సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్ చుట్టూ కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. శనివారం ఉదయం 8 గంటల వరకే వందలాది మంది పోలీసులు, అధికారులు పార్కు పక్కనే ఉండే రైతుల పంటపొలాల వద్దకు చేరుకున్నారు. చింతలపల్లి, సంగెం నుంచి వచ్చే మెయిన్‍ రోడ్లతో పాటు రైతులు ఎక్కువగా నడిచే వంచనగిరి, శాయంపేట ఎడ్లబండ్ల రోడ్లను సిబ్బందితో నింపేశారు. శాయంపేట ఊరి నుంచి చెరువు గట్టు మీదుగా శివారులో కిలోమీటర్‍ దూరంలో ఉండే భూముల వరకు ఎక్కడపడితే అక్కడ పోలీస్‍ బందోబస్తు పెట్టారు. రైతు అనేవారు అటురాకుండా అడ్డుకున్నారు. ఎవరి దగ్గరైతే భూములు తీసుకోవాలని భావించారో వారి వివరాలను పోలీసులు, అధికారులు ముందస్తుగా తీసుకున్నారు. ఆ జాబితాలోని వ్యక్తి అటుగా వస్తే అదుపులోకి తీసుకున్నారు. పంటకు నీరు పెట్టకుంటే మొక్కజొన్న చేను ఎండిపోతుందన్నా.. కూరగాయలు పిందె దశలోనే రాలిపోతాయన్నా వినలేదు. చేను గట్ల మీదుగా పొలాల వద్దకు చేరిన రైతులను పోలీసులు బెదిరిస్తూ పరుగులు పెట్టించారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. తమ భూములు గుంజుకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ పురుగుల మందు సీసాలు చూపారు. ఏండ్ల తరబడి భూములను నమ్ముకుని బతుకుతున్న తమ చేన్ల వద్ద పోలీసులు, ఆఫీసర్ల బెదిరింపులేంటని ప్రశ్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 150 మందికి పైగా పోలీసులు, అధికారులు భూముల్లోకి రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు పంటపొలాల్లో డిజిటల్‍ సర్వే చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వే నిర్వహించారు. ఆ సమయంలో ఏ ఒక్క రైతు కూడా దరిదాపుల్లోకి రాకుండా బందోబస్తు పెట్టారు. పోలీస్​స్టేషన్​కు తరలించిన రైతులను సర్వే పూర్తయిన తర్వాత వదిలిపెట్టారు. 

భూములపై మరోసారి లీడర్ల కన్ను

వరంగల్‍ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్ పెట్టేందుకు 2106లో నిర్ణయించింఇ. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భూసేకరణ బాధ్యత తీసుకున్నారు. నయానో భయానో ఒప్పించి 1200 ఎకరాల వరకు సేకరించారు. భూములు ఇచ్చిన రైతులకు పార్క్ స్థలంలో డబుల్‍ బెడ్‍రూం ఇండ్ల ప్లాట్లు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎకరం రూ.50 లక్షల వరకు ఉంటే కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇస్తున్నారంటూ రైతులు పలుసార్లు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సేకరించిన భూముల వరకు గోడలు కట్టారు. దీనికి బయట ఉండే మిగతా భూముల్లో బాధిత రైతులు పంటలు వేసుకుంటున్నారు. పార్కు కోసం భూములు తీసుకునే సమయంలో  రైతుల మిగతా భూముల జోలికి వచ్చే ప్రసక్తే  లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మిగిలిన భూములకు డిమాండ్‍ పెరిగి శ్రీమంతులు అవుతారన్నారు. తీరాచూస్తే.. ఇప్పుడు లీడర్ల కన్ను కైటెక్స్ కంపెనీకి దగ్గర్లో ఉన్న మరో 30 ఎకరాలపై పడింది. ఇందులో పట్టా పాస్‍బుక్‍ ఉన్న భూములు 14 ఎకరాల వరకు ఉండగా.. రికార్డులు సరిగాలేని మరో 16 ఎకరాలను వారి ఖాతాలో వేసుకునేలా కొందరు అధికార పార్టీ నేతలు తెరవెనుక కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కైటెక్స్ కంపెనీ కోసం మరో 13 ఎకరాల 29 గుంటల భూములను ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం 34 మంది రైతులకు అధికారులు నోటీసులు పంపారు.  దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అధికారులు గతంలో చెప్పిన మాటపై ఉండటం లేదని పలుసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బలవంతంగా సర్వేకు వస్తున్నారంటూ  రైతులు, వారి కుటుంబసభ్యులు నవంబర్‍ 11న పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ సర్కారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఏం తప్పు చేసినమని స్టేషన్​లో పెట్టిన్రు

ఏండ్ల తరబడి పంట భూములను నమ్ముకుని బతుకుతున్నం. నష్టమని తెలిసినా ఒకసారి అడిగితే భూములు ఇచ్చినం. మిగతా భూముల జోలికి రాకుండా అందరికీ ఉద్యోగాలు, డబుల్‍ బెడ్‍రూం ఇండ్లిస్తమని మాటిస్తే అప్పుడు పంటపొలాలు వారి చేతిలో పెట్టినం. ఐదారేండ్లు గడుస్తున్నా వారు చెప్పినయ్‍ రాలే. ఇప్పుడేమో మిగతా భూములు కావాలని దౌర్జన్యం చేస్తున్రు. మా భూములకాడికొచ్చి మహిళలు అని కూడా చూడకుండా మమ్మల్ని దొంగల్లెక్క పోలీస్‍ స్టేషన్‍లో పెట్టిన్రు. నమ్మినందుకు ఇదేనా న్యాయం.  
– దేవులపల్లి సులోచన, రైతు

మూడున్నర ఎకరాలూ ఇయ్యాలంటా

యాభై, అరవై ఏండ్లబట్టి ఇంటోళ్లమంతా భూములమీదే ఆధారపడ్డాం. భూములే మాకు ఆధారం. అప్పట్లనే ఏదేదో చెప్పి రెండెకరాల వరకు గుంజుకున్నరు. పార్క్ స్థలం వరకు గోడ పెట్టిన్రు. ఈ రోజు ఆ గోడ తీసేసి లోపలకు వచ్చిన్రు. నాది, కూతురుకు బహుమానంగా ఇచ్చిన  మొత్తం మూడున్నర ఎకరాలు కూడా కంపెనీకి ఇయ్యాలే అంటున్రు. పెద్దోళ్లన్నప్పుడు జర మాట మీద ఉండాలి.
- సముద్రాల మల్లయ్య, బాధిత రైతు