సిగరెట్ తాగడంపై వివాదం.. సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ

సిగరెట్ తాగడంపై వివాదం.. సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ

గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో మొత్తం 33మందిని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌చంద్ హాస్టల్‌లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై సెక్యూరిటీ గార్డులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఘర్షణ తలెత్తిందని పోలీసులు తెలిపారు. "జూన్ 4 రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం 33 మందిని అదుపులోకి తీసుకుంది. పోలీసులు ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు" అని పోలీసులు స్పష్టం చేశారు.

అదుపులోకి తీసుకున్న వారిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కళాశాల విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఎకోటెక్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషయంపై సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరింత మందిని అదుపులోకి తీసుకోవచ్చని పోలీసులు అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది కర్రలు చేతపట్టుకుని హాస్టల్ వెలుపల పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లను ధ్వంసం చేస్తూ, ఘర్షణకు దిగారు.