ఈయన దగ్గరున్న విస్కీ బాటిళ్లు చాలా స్పెషల్… ధర ఎంతో తెలుసా?

ఈయన దగ్గరున్న విస్కీ బాటిళ్లు చాలా స్పెషల్… ధర ఎంతో తెలుసా?

ఆయన దగ్గర..రూ. 99 కోట్ల విస్కీ

20 ఏండ్లుగా విస్కీ కలెక్షన్ చేస్తున్న వియత్నాం బిజినెస్ మ్యాన్

90 ఏండ్ల నాటి విస్కీ బాటిళ్లూ ఈయన సొంతం

గుయెన్ డిన్ తువాన్. వియత్నాంలో పెద్ద బిజినెస్ మ్యాన్. హో చి మిన్ సిటీలో ఆయనకు ఖరీదైన బంగళా ఉంది. అందులో.. ప్రపంచంలోనే ప్రత్యేకమైన విస్కీ లాంజ్ ఉంది. ఆ లాంజ్ లో చాలా జాగ్రత్తగా భద్రపర్చిన 500 విస్కీ బాటిళ్లు ఉన్నయి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం లెక్కిస్తే.. ఆ విస్కీ బాటిళ్లన్నింటినీ అమ్మితే ఎన్ని పైసలొస్తయో తెలుసా? సుమారుగా10.8 మిలియన్ పౌండ్లు. మన రూపాయల్లో చెప్పుకోవాలంటే.. రూ. 99.51 కోట్లు! కేవలం 500 విస్కీ బాటిళ్లకు అంత రేటా? అని అవాక్కయ్యారా! అవి అలాంటి ఇలాంటి బాటిళ్లు కావు మరి. అందులోని విస్కీ కూడా నిన్నా, మొన్నటిది కాదు. దాదాపు 90 ఏండ్ల కిందట తయారు చేసిన విస్కీ కూడా ఆ బాటిళ్లలో ఉందట. విస్కీ ఎంత పాతదైతే అంత రేటు ఎక్కువ పలుకుతుంది. అంతేకాకుండా గుయెన్ దగ్గర ఉన్న బాటిళ్లు కూడా తయారీ విషయంలో వెరీ స్పెషల్ అని ‘రేర్ విస్కీ 101’ అనే సంస్థ బ్రిటన్ మార్కెట్ ప్రకారం వాటి విలువను అంచనా వేసింది. దీంతో అన్నింటికీ కలిపి రూ. 99 కోట్ల విలువ ఉందని సర్టిఫికెట్ ఇచ్చింది. గిన్నిస్ బుక్ వాళ్లు కూడా ఈ లాంజ్ ను పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన విస్కీ కలెక్షన్ ఓనర్ గా గుయెన్ కు రికార్డ్ ను కట్టబెట్టారు. అయితే, ఇది తనకు ప్యాషన్ మాత్రమేనని, వీటిలో ఒక్క బాటిల్ కూడా అమ్మే ప్రసక్తే లేదని గుయెన్ స్పష్టం చేస్తున్నారు.

20 ఏండ్ల నుంచీ విస్కీ కలెక్షన్

గుయెన్ కు విస్కీ కలెక్షన్ అంటే ప్యాషన్ అట. అందుకే 20 ఏండ్ల నుంచీ ఎక్కడ పాత కాలం నాటి విస్కీ బాటిల్ కనిపించినా, కొనుక్కుని తెచ్చి తన విస్కీ లాంజ్ లో భద్రపరుస్తున్నాడు. ఈయన కలెక్షన్ లో 1926 నాటి ‘ఫైన్ అండ్ రేర్’ విస్కీ కూడా ఉందట. మెకల్లన్ అనే సంస్థ 1926లో కేవలం 40 ‘ఫైన్ అండ్ రేర్’ బాటిళ్లను మాత్రమే విడుదల చేయగా, గుయెన్ దగ్గర అవి మూడు ఉన్నాయట. ఇటీవల ఓ వ్యక్తి తన దగ్గరున్న ‘ఫైన్ అండ్ రేర్’ బాటిల్ ను అమ్మగా.. ఒక్క బాటిల్ కే రూ. 13 కోట్లు వచ్చాయట!  అలాగే పాతకాలం నాటి12 బౌమోర్ బాటిళ్లలో ఒకటి ఇటీవల రూ. 2.76 కోట్లకు అమ్ముడు పోయిందట. ఆ 12 బాటిళ్లలో ఒకటి ప్రస్తుతం గుయెన్ దగ్గర ఉందట. 1919 నాటి వింటేజ్ స్ప్రింగ్ బ్యాంక్ బాటిళ్లు 24 మాత్రమే మార్కెట్లోకి రాగా, వాటిలో ఒక బాటిల్ ను కూడా ఆయన సేకరించాడట.