V6 News

టెస్టులు చెయ్యట్లే .. మందులియ్యట్లే!..కొండాపూర్ దవాఖానలో నిర్వాకం

టెస్టులు చెయ్యట్లే .. మందులియ్యట్లే!..కొండాపూర్ దవాఖానలో నిర్వాకం
  •  విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో గుర్తింపు
  • అధికారులను అడ్డుకున్న డాక్టర్లు, వాగ్వాదం

గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై వరుస ఫిర్యాదులు రావడంతో బుధవారం ఉదయం 10 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అధికారులు ఆసుపత్రికి చేరుకోగానే ముందుగా అటెండెన్స్ రిజిస్టర్లు, బయోమెట్రిక్ యంత్రాలను తనిఖీ చేశారు. కొందరూ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం డ్యూటీకి డుమ్మా కొట్టినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది అనంతరం ల్యాబ్ విభాగంలో తనిఖీలు నిర్వహించి, పరికరాలు పనిచేయడం లేదనే నెపంతో టెస్టులు చేయకుండా రోగులను ప్రైవేట్ ల్యాబ్​లకు పంపిస్తున్నట్లు గుర్తించారు.

ఫార్మసీలోనూ ఉచిత మందులు ఇవ్వకుండా రోగులను బయట మెడికల్ షాపులకు రిఫర్ చేస్తున్నట్లు నిర్ధారించారు. చివరగా వార్డుల్లో పారిశుధ్యం, క్యాంటీన్​లోని ఆహార నాణ్యతను పరిశీలించి, నేరుగా రోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తనిఖీల సమయంలో కొందరు డాక్టర్లు.. అధికారులను ఎవరు మీరు, ఎందుకు తనిఖీలు చేస్తున్నారో చెప్పాలని అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు.