ఉప్పల్, వెలుగు: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు ఉప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లు, బ్రోకర్ల దందాలపై ఆరా తీశారు. కీలక పత్రాలు, రికార్డులను పరిశీలించిన అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు.
మీడియేటర్లు ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు గమనించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించే సిబ్బంది, బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకస్మిక తనిఖీలతో కార్యాలయ వర్గాల్లో కలకలం రేగింది.
ఎల్బీనగర్ జోన్ సర్కిల్ ఆఫీసుల్లో..
దిల్‌సుఖ్‌నగర్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ సర్కిల్ కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ రూరల్ యూనిట్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేపట్టింది. సరూర్‌నగర్‌లోని సర్కిల్-12, ఎల్బీనగర్ సర్కిల్-13, హయత్‌నగర్ సర్కిల్-14 కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు.
