Vijay Devarakonda : వాలీబాల్ టీం కో ఓనర్గా రౌడీ హీరో

Vijay Devarakonda : వాలీబాల్ టీం కో ఓనర్గా  రౌడీ హీరో

ప్రైమ్ వాలీబాల్ లీగ్ లో పోటీ పడుతున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీంకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కో-ఓనర్ గా మారాడు. అంతేకాదు ఆ టీంకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఓనర్ అభిషేక్‌ రెడ్డి కంకణాల ప్రకటించారు. అనంతరం మాట్లాడిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ మ్యాచ్‌ కేవలం ఆరంభం మాత్రమే. వాలీబాల్‌ను దేశంలో ప్రతి మూలకు తీసుకువెళ్లాలన్నది మా లక్ష్యం. ఏజ్, బ్యాక్‌ గ్రౌండ్, జెండర్ అనే తేడా లేకుండా.. అన్ని స్ధాయిల ప్రజలకు దీన్ని చేరువ చేయాలనుకుంటున్నాము. వాలీబాల్‌ను కేవలం ఓ క్రీడగా మాత్రమే కాదు, దీనిని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగించే రీతిలో మార్చాలనుకుంటున్నాము’ అని అన్నాడు.

ఇండియన్‌ ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ లీగ్‌ లో హైదరాబాద్‌, అహ్మాదాబాద్‌, కోల్‌కతా, కాలికట్‌, కొచి, చెన్నై, బెంగళూరు, ముంబైల నుంచి ఎనిమిది టీమ్‌లు పోటీపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ ఒక్కటే ప్రాతినిధ్యం వహిస్తోంది. వాలీబాల్ లీగ్ రెండో ఎడిషన్ ఫిబ్రవరి 4న మొదలై మార్చి 5 వరకు జరుగుతాయి. ఈ లీగ్ ని సోనీ స్పోర్ట్స్‌ 1, 3, 4లలో ప్రసారం చేయనున్నారు. సోనీ లివ్‌ యాప్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్‌ చూడొచ్చు.