
‘లిటిల్ హార్ట్స్’ మూవీ సాధించిన విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తినిస్తోందని విజయ్ దేవరకొండ అన్నాడు. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఏ సపోర్ట్ లేకుండా ఔట్ సైడర్స్ సాధించిన ఈ సక్సెస్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
డైరెక్టర్ సాయి మార్తాండ్ ఒక చిన్న కథను బ్యూటిఫుల్‌గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. నటీనటులంతా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ టీమ్ మరిన్ని మంచి సక్సెస్ ఫుల్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. కార్యక్రమానికి హాజరైన అల్లు అరవింద్, బండ్ల గణేష్ టీమ్‌ను అభినందించారు.
నటులు మౌళి తనూజ్, శివానీ, రాజీవ్ కనకాల, అనిత చౌదరి, సత్య కృష్ణన్, డైరెక్టర్ సాయి మార్తాండ్, సినిమా రిలీజ్ చేసిన బన్నీ వాస్, వంశీ నందిపాటి తదితరులు పాల్గొన్నారు.