Gandhi Talks Trailer: విజయ్ సేతుపతి మూకీ సినిమా.. డైలాగ్స్ లేవు.. ఇంపాక్ట్ మాత్రం భారీగా!

Gandhi Talks Trailer: విజయ్ సేతుపతి మూకీ సినిమా.. డైలాగ్స్ లేవు.. ఇంపాక్ట్ మాత్రం భారీగా!

వర్సటైల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘గాంధీ టాక్స్’. అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాధవ్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూకీ సినిమాను ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రా కలిసి నిర్మించారు.

ఇప్పటికే ‘గాంధీ టాక్స్’ నుంచి విడుదలైన రెండు స్పెషల్ టీజర్స్‌కు మంచి స్పందన లభించింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో, లేటెస్ట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. “ప్రతి కథకు మాటలు అవసరం లేదు.. కొన్ని దృశ్యాలు చూడగానే మనసును తాకుతాయి. ఈసారి తెరపై మాటలు ఉండవు.. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది” అని మేకర్స్ తెలిపారు.

గాంధీ బొమ్మ ఉన్న భారతీయ కరెన్సీ నోటు మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. డైలాగ్స్ లేకుండా, రా ఎమోషన్స్, ఇంటెన్స్ విజువల్స్, నటీనటుల శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ద్వారా ఒక బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారనే ఆసక్తిని ట్రైలర్ క్రియేట్ చేసింది. అంతేకాదు, ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

మూకీ సినిమా చరిత్ర:

ప్రపంచ సినీ చరిత్రలో తొలి రోజుల్లో మాటలు, శబ్దాలు లేని మూకీ చిత్రాలే నిర్మించబడేవి. అప్పట్లో సౌండ్ రికార్డింగ్ టెక్నాలజీ లేకపోవడంతో తెరపై పాత్రలు నిశబ్దంగా కదిలేవి. సన్నివేశాల ఆధారంగానే ప్రేక్షకులు కథను అర్థం చేసుకునేవారు.

తెలుగులో మొట్టమొదటి మూకీ చిత్రం “భీష్మ ప్రతిజ్ఞ”. ఈ చిత్రాన్ని 1922లో రఘుపతి వెంకయ్య నాయుడు నిర్మించారు. ఆయన కుమారుడు ఆర్.ఎస్. ప్రకాష్ దర్శకత్వం వహించగా, రఘుపతి వెంకయ్య నాయుడే హీరోగా నటించారు.

అనంతరం 1926లో సి. పుల్లయ్య కాకినాడ పరిసర ప్రాంతాల్లో “భక్త మార్కండేయ” చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, థియేటర్లలో కాకుండా తెల్లటి ఇళ్ల గోడలపై ప్రదర్శించేవారు. అందుకే ఆ రోజుల్లో సినిమాను “గోడ మీద బొమ్మ” అని పిలిచేవారు.

ఆధునిక టాకీ యుగంలో వచ్చిన తొలి మూకీ చిత్రం “పుష్పక విమానం”. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 27 నవంబర్ 1987న విడుదలైంది. ఈ సినిమా పూర్తిగా సంభాషణలు లేకుండా తెరకెక్కినప్పటికీ, శబ్దాలు మాత్రం వినిపిస్తుంటాయి. అందువల్ల దీనిని సగం మూకీ, సగం టాకీ చిత్రంగా అభివర్ణించవచ్చు.