పాన్‌ ఇండియా స్టార్ అని పిలవొద్దు: విజయ్ సేతుపతి

పాన్‌ ఇండియా స్టార్ అని పిలవొద్దు: విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విలక్షన నటుడు బాలీవుడ్ లో ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలోఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడిని పాన్‌ ఇండియా స్టార్‌గా యంకర్ అభివర్ణించింది. దీంతో తనని అలా పిలవడంపై ఆయన అసహనానికి గురయ్యాడు. 

తనను పాన్‌ ఇండియా నటుడని పిలవొద్దని.. నేను కేవలం నటుడిని మాత్రమే అని విజయ్ చెప్పుకొచ్చాడు. పాన్‌ ఇండియా స్టేట్‌మెంట్‌తో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని.. కొన్నిసార్లు ఆ మాట ఒత్తిడికి కూడా గురి చేస్తుందన్నాడు. అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉందని.. బెంగాలీ, గుజరాత్‌ ఇలా ఎక్కడ అవకాశం వచ్చినా నటిస్తానని విజయ్ సేతుపతి అన్నాడు. 

ఇక ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్–డికేలు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ప్రస్తుతం విజయ్ ‘మేరీ క్రిస్మస్‌’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నాడు.