వరల్డ్ కప్ నుంచి విజయ్ శంకర్ అవుట్

వరల్డ్ కప్ నుంచి విజయ్ శంకర్ అవుట్
  • గాయంతో టోర్నీ నుంచి వైదొలిగిన విజయ్‌‌
  • రిప్లేస్‌‌మెంట్‌‌గా మయాంక్‌‌ అగర్వాల్‌‌
  • అంబటి రాయుడుకు మళ్లీ నిరాశే

బర్మింగ్‌‌హామ్‌‌: టీమిండియాలో మరో వికెట్‌‌ పడింది. గాయం కారణంగా మరో ఆటగాడు వరల్డ్‌‌కప్‌‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఎడమ కాలి బొటన వేలు ఫ్రాక్చర్‌‌ కావడంతో ఆల్‌‌రౌండర్‌‌ విజయ్‌‌ శంకర్‌‌ మిగతా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే స్టార్‌‌ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ సేవలు కోల్పోవడం.. భువనేశ్వర్‌‌ కుమార్‌‌ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో శంకర్‌‌ నిష్క్రమణ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. విజయ్‌‌ స్థానంలో కర్ణాటక ఆటగాడు, ఓపెనర్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ను సెలెక్ట్‌‌ చేసినట్టు బీసీసీఐ సోమవారం ప్రకటించింది.

‘జూన్‌‌ 19న సౌతాంప్టన్‌‌లో నెట్స్‌‌లో బ్యాటింగ్‌‌ చేస్తుండగా బుమ్రా వేసిన యార్కర్‌‌ విజయ్‌‌ శంకర్‌‌ ఎడమ కాలి బొటన వేలుకు బలంగా తగిలింది. అయినా అఫ్గానిస్థాన్‌‌, వెస్టిండీస్‌‌తో మ్యాచ్‌‌ల్లో అతను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడు. కానీ, విండీస్‌‌తో మ్యాచ్‌‌ తర్వాత గాయం తిరగబెట్టింది. బొటన వేలికి ఫ్రాక్చర్‌‌ అయినట్టు సీటీ స్కాన్‌‌లో తేలింది. దాన్నుంచి కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది. ఈ గాయం కారణంగా ప్రస్తుత వరల్డ్‌‌కప్‌‌ నుంచి శంకర్‌‌ తప్పుకున్నాడు. అతని ప్లేస్‌‌లో టాపార్డర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా ఉపయోగపడే ఆటగాడు కావాలని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ విజ్ఞప్తి చేయడంతో మయాంక్‌‌ అగర్వాల్‌‌ను ఆలిండియా సెలెక్షన్‌‌ కమిటీ ఎంపిక చేసింది. శంకర్‌‌కు రిప్లేస్‌‌మెంట్‌‌గా మయాంక్‌‌ను జట్టులోకి తీసుకునేందుకు ఐసీసీ కూడా అనుమతించింది’అని బోర్డు ప్రకటన విడుదల చేసింది.

గతేడాది ఆస్ట్రేలియాపై టెస్ట్‌‌ అరంగేట్రం చేసిన మయాంక్‌‌ ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే, రాహుల్‌‌ ద్రవిడ్‌‌ కోచింగ్‌‌లో రాటు దేలిన మయాంక్‌‌కు ఇండియా-–ఎ టీమ్‌‌ తరఫున ఇంగ్లండ్‌‌లో ఆడిన అనుభవం ఉంది. ఇంగ్లండ్‌‌ లయన్స్‌‌, వెస్టిండీస్‌‌-–ఎ టీమ్‌‌తో జరిగిన వన్డే ట్రై సిరీస్‌‌ను ఇండియా-–ఎ గెలుచుకోగా.. మయాంక్‌‌, పృథ్వీ షా టాప్‌‌ స్కోరర్లుగా నిలిచారు. దాంతో, మయాంక్‌‌ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. గత ఐపీఎల్‌‌లో  పంజాబ్‌‌కు ఆడిన అగర్వాల్ 13 ఇన్నింగ్స్‌‌ల్లో 338 రన్స్‌‌ చేసి ఆకట్టుకున్నాడు. ఓపిగ్గా బ్యాటింగ్‌‌ చేసే సామర్థ్యంతో పాటు టెక్నిక్‌‌ పరంగా కూడా మయాంక్‌‌ మంచి ఆటగాడే.