- మద్దతుగా ఓటేసిన 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
- వ్యతిరేకంగా 22 మంది, మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరం
- అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలు
- అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఎడప్పాడి పళనిస్వామి
- డీఎంకే కుటుంబ పాలనపై ఎక్స్‌లో మండిపడ్డ సీఎం విజయ్
చెన్నై/ న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కారు నెగ్గింది. మొత్తం 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీకి 118 ఓట్లు అవసరం కాగా, విజయ్ ప్రభుత్వం ఏకంగా 144 ఓట్లను సాధించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు, ఇప్పటికే మద్దతు తెలిపిన పార్టీలతో పాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఎమ్మెల్యేలు కూడా అనుకూలంగా ఓటేశారు. విశ్వాస పరీక్షలో విజయ్ సర్కారుకు 144 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేయగా 22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేశారు.
డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీంతో విజయ్ సర్కారుకు ప్రస్తుతం ఢోకా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బల నిరూపణ కోసం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష అవసరమైంది. బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్ లో ప్రభుత్వం తన బలం నిరూపించుకుంది. అనంతరం సీఎం విజయ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ మా ప్రభుత్వాన్ని మేం మైనారిటీ ప్రభుత్వంగానే భావిస్తామని వ్యాఖ్యానించారు. దీని అర్థం.. రాష్ట్రంలోని మైనారిటీల హక్కుల కోసం పనిచేసే ప్రభుత్వమని విజయ్ పేర్కొన్నారు.
టీవీకే ఎమ్మెల్యేలలో 105 మందికే ఓటు
అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే.. బల పరీక్షలో 105 మంది మాత్రమే ఓటేశారు. సీఎం విజయ్ రెండు స్థానాల్లో గెలవగా ఒక సీటును వదులుకోవడం, స్పీకర్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే ఓటు వేసే అవకాశం లేకపోవడంతో పాటు కోర్టు తీర్పుతో ఒక ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరం కావడంతో టీవీకే బలం 105కు తగ్గింది. మిత్ర పక్షాలు కాంగ్రెస్ (5), వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల (8) ఎమ్మెల్యేలతో పాటు అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు 24 మంది, ఏఎంఎంకే, డీఎండీకే ఎమ్మెల్యేలు ఓటేయడంతో 144 ఓట్లతో టీవీకే సర్కారు బల పరీక్షలో నెగ్గింది.
డీఎంకే ‘కుటుంబ పాలన’పై సీఎం విజయ్ ఫైర్
విశ్వాస పరీక్షలో ఘనవిజయం సాధించిన అనంతరం సీఎం జోసెఫ్ విజయ్ ఎక్స్ వేదికగా డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతూనే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే అనుసరించిన వైఖరిని
ఎండగట్టారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే కుటుంబ పాలన అంతానికి ఈ విజయం ఒక బలమైన పునాది అని ఆయన స్పష్టం చేశారు.
బలపరీక్షకు దూరంగా ఉండాలన్న డీఎంకే నిర్ణయాన్ని విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన డీఎంకే పగటి కలలు కల్లలయ్యాయని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో ఓటింగ్‌కు హాజరుకాకుండా పారిపోవడం ద్వారా వారు తమ ఓటమిని పరోక్షంగా అంగీకరించారని, ప్రజాస్వామ్య ప్రక్రియ నుంచి తప్పించుకున్నారని దుయ్యబట్టారు.
24 గంటల్లోనే జ్యోతిష్యుడి తొలగింపు
తమిళనాడు రాజకీయాల్లో పెను వివాదానికి కారణమైన జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని సీఎం విజయ్ రద్దు చేశారు. వెట్రివేల్ ను ఓఎస్డీగా నియమిస్తూ సీఎం విజయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడంపై మిత్రపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా నిరసనలు వెల్లువెత్తడం తో, ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో నియామకమైన ఒక్క రోజులోనే వెట్రివేల్ ను పదవి నుంచి తొలగిస్తూ సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.
