కూల్చేయడం తప్ప చేసేదేం ఉండదు

కూల్చేయడం తప్ప చేసేదేం ఉండదు

హైదరాబాద్, వెలుగు: ‘సీఎం కేసీఆర్‌‌ ఎక్కడికి వెళ్తే అక్కడ కూల్చేయడం తప్ప చేసేదేం ఉండదు. వరంగల్ వెళ్లి సెంట్రల్ జైలు కూల్చేయించారు. అంతకు ముందు సెక్రటేరియట్ కూల్చేయించారు. ప్రగతి భవన్ వెళ్లి అక్కడ పక్కనున్న భవనాలనూ కూల్చేయించారు. ఇప్పుడు జిల్లాలకు వెళ్తానంటున్న కేసీఆర్ ప్రకటనను చూసి ఆ జిల్లాల జనం భయపడిపోతున్నారు. జిల్లాకు వచ్చి ఏమేం కూల్చి వేయమంటారోనని ఆందోళన చెందుతున్నారు’ అని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌‌లో మీడియాకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేసేందుకు తానే జిల్లాల్లో పర్యటిస్తానని అడిషనల్ కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించడం పెద్ద జోక్‌‌ అన్నారు. ఎన్నికలప్పుడు తప్ప కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ దాటి ఎటూ వెళ్లరని అందరికీ అర్థమైందన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికప్పుడు మళ్లీ వస్తానని, అభివృద్ధి ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మళ్లీ అటు వైపు వెళ్లలేదన్నారు. 

అప్పట్లో కుక్కలు, చెప్పులన్నరు.. ఇప్పుడేమంటరో?

సీఎం పర్యటనలప్పుడు ఆయన్ను నిలదీసే బాధితులను కుక్కలు, చెప్పులని శాపనార్థాలు పెట్టారని విజయశాంతి గుర్తు చేశారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్‌‌ బాధితులు, మూడెకరాల భూమి దక్కని దళితులు, పరిహారం అందని భూ నిర్వాసితులు సీఎంను నిలదీసేందుకు రెడీగా ఉన్నారని.. వాళ్లను ఏమంటారోనన్నారు. వాటిని కవర్ చేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం, వాళ్లను జైలుకు పంపడం లాంటి చిత్ర, విచిత్ర, తిక్క, తుగ్లక్ విన్యాసాలన్నీ కేసీఆర్ చేశారని, ఇప్పుడు మళ్లీ అలాంటి వి కనబడొచ్చని చెప్పారు.