కేసీఆర్ సర్కార్ ను గద్దె దించే అతిపెద్ద స్కీం ప్రజల దగ్గర ఉంది: విజయశాంతి

కేసీఆర్ సర్కార్ ను గద్దె దించే అతిపెద్ద స్కీం ప్రజల దగ్గర ఉంది: విజయశాంతి
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి
  • పార్టీ అవినీతిలో జాతీయ స్థాయికి తీసుకెళ్తారని ఎవరూ ఊహించలేదు
  • లిక్కర్ స్కామ్ నిజమైతే రాజీనామా చేస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పట్లే
  • కేసీఆర్ సర్కార్ ను గద్దె దించే అతిపెద్ద స్కీం ప్రజల దగ్గర ఉందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అంటే బేటీస్ రాబరీ స్కీమ్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. ‘లిక్కర్ స్కాం అబద్ధం.. ఇందులో నాకు, నా కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది నిజమైతే రాజీనామా చేస్తానని’ సీఎం కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీని జాతీయ స్థాయిలో విస్తరిస్తామని కేసీఆర్ చెప్పారని, కానీ ఆయన, తన కుటుంబ సభ్యులతో కలిసి ఇలా జాతీయ స్థాయికి తీసుకెళ్తారని ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఎన్నో త్యాగాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ దొరలు ఇంత ఘనంగా తాకట్టు పెడుతున్నారని, ఇప్పటి పరిస్థితిని చూస్తే అమరుల ఆత్మలు ఎంతగా క్షోభిస్తాయో అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో భవిష్యత్తు దేశ రాజకీయాలు ఇలా ఉంటాయని పార్టీ ప్రారంభంలోనే తన అవినీతి ఘనతను కేసీఆర్ చాటుకున్నారని, ఆయన చెప్పే మాటలు నమ్మే అమాయకత్వంలో 130 కోట్ల మంది దేశ ప్రజలు లేరని చెప్పారు. ఈ దగాకోరు కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసగించి ఎన్ని స్కాములు చేసినా.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే అతి పెద్ద స్కీమ్ ప్రజల దగ్గర ఉందని విజయశాంతి అన్నారు.