స్కీముల పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ : విజయశాంతి

స్కీముల పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ  దోపిడీ : విజయశాంతి

జీడిమెట్ల, వెలుగు: స్కీముల పేరులో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దండుకుంటున్నదని మాజీ ఎంపీ, బీజేపీ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఫైరయ్యారు. ప్రజలపై కేసీఆర్​కు ఎలాంటి ప్రేమ లేదని, ఆనాడు కేవలం పదవి రాకపోవడంతోనే టీఆర్​ఎస్ పార్టీ పెట్టాడన్నారు. అందరి పోరాటంతో వచ్చిన తెలంగాణలో  కేసీఆర్​ ఫ్యామిలీ మాత్రమే రాజ్యమేలుతున్నదన్నారు. పేదలకు డబుల్​బెడ్రూం ఇండ్లు, రేషన్​ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా కుత్బుల్లాపూర్ సర్కిల్ మున్సిపల్  ఆఫీస్​ వద్ద సోమవారం మహాధర్నా చేపట్టింది.  కేసీఆర్​ అమలు చేస్తున్న పథకాలేవీ ప్రజల కోసం కాదని, ఆయన కుటుంబం కోట్లు సంపాదించడం కోసమేనని విమర్శించారు. కేసీఆర్​ను దించడం కోసం, తమ హక్కుల కోసం తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.  బీఆర్​ఎస్​ పార్టీ ప్రచారం కోసం వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల సొమ్మును పంచుతున్నాడని మండిపడ్డారు. 90 రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

కుత్బుల్లాపూర్​ సర్కిల్ ఆఫీసులో బైఠాయింపు

మహాధర్నా అనంతరం విజయశాంతితోపాటు బీజేపీ నాయకులు కుత్బుల్లాపూర్​ డిప్యూటీ కమిషనర్  మంగతాయారుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆమె అందుబాటులో లేరు. దీంతో విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. ఆమె వచ్చే వరకు ఇక్కడే ఉంటామంటూ బైఠాయించారు. ఈ  క్రమంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు 45 నిమిషాల తర్వాత డిప్యూటీ కమిషనర్​ రావడంతో ఆమెకు వినతి పత్రం అందజేశారు.  ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్​ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్​రాజు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, జిల్లా అధ్యక్షుడు హరీశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ​