కాంగ్రెస్​లోకి విజయశాంతి.. ఖర్గే సమక్షంలో చేరిక

కాంగ్రెస్​లోకి విజయశాంతి.. ఖర్గే సమక్షంలో చేరిక
  • కాంగ్రెస్​లోకి విజయశాంతి
  • పార్టీ చీఫ్​ ఖర్గే సమక్షంలో చేరిక
  • మేనిఫెస్టో సభలో కాంగ్రెస్​లో చేరిన మందా జగన్నాథం

హైదరాబాద్, వెలుగు: ఇటీవల బీజేపీకి రాజీ నామా చేసిన విజయశాంతి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్​ తాజ్​కృష్ణ హోటల్​లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్​ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యారు. ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రే ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తున్నదని విజయశాంతి అన్నారు. అన్ని విషయాలు శనివారం ప్రెస్​మీట్​లో చెప్తానని తెలిపారు. 

2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి.. కేసీఆర్​ విజ్ఞప్తి మేరకు 2009లో టీఆర్​ఎస్​లో విలీనం చేశారు. మెదక్​ ఎంపీగా గెలిచారు. అనంతరం ఆమెను కేసీఆర్​ పక్కనపెట్టడంతో 2014లో కాంగ్రెస్​లో చేరారు. కొన్నాళ్ల పాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​గా పనిచేశారు. అయితే, అక్కడ తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ 2020లో బీజేపీలో చేరారు. బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. అయితే, ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకి అయిన కిరణ్​ కుమార్​ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం చెప్పారు. 

కొన్నాళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి.. శుక్రవారం కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్​ మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం కూడా ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శుక్రవారం గాంధీభవన్​లో మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.