బీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం: విజయశాంతి

బీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం: విజయశాంతి
  • బీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం
  • ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు: విజయశాంతి
  • వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డికి ఇదే చెప్పారు
  •  ఇది నిజమో.. కాదో.. చెప్పాలని ట్వీట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ లీడర్ల అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్తేనే బీజేపీలో చేరామని కాంగ్రెస్ నేత, పీసీసీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ విజయశాంతి అన్నారు. ఈ హామీ మేరకు పార్టీలో చేర్చుకున్నది నిజం కాదా అని ట్విట్టర్​లో బీజేపీ లీడర్లను ఆమె ప్రశ్నించారు. ‘‘రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్లు ఒకటి తెలుసుకోవాలి. 

కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడేండ్లు జెండా మోసి కొట్లాడింది నేను. నాడు బండి సంజయ్​, కిషన్ రెడ్డి, కొందరు లీడర్లు నా వద్దకు వచ్చి చర్చలు జరిపారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరూ మద్దతిస్తే బీజేపీ కొట్లాడుతుందని చెప్పి నన్ను, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒప్పించారు. కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి పార్టీలో చేర్చుకున్నారు. 

ఇదంతా నిజం కాదా? రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలని కొట్లాడినం”అని విజయశాంతి తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటేచాలన్న ఒకే ఒక్క కారణంతో కొన్నేండ్లు పని చేసిన కాంగ్రెస్​ను వదిలి బీజేపీలో చేరామన్నారు. కానీ, బీజేపీ తన మాట నిలబెట్టుకోలేక మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్​తో బీజేపీ డీల్ కుదుర్చుకున్నదని తెలిసే చాలా మంది రాజీనామాలు చేసి బయటికొచ్చారన్నారు.