విజేత సూపర్ మార్కెట్‌లో కుళ్లిన ఆహార పదార్థాలు

విజేత సూపర్ మార్కెట్‌లో కుళ్లిన ఆహార పదార్థాలు

సూపర్ మార్కెట్ చూస్తే చాలు జనాలు ఎగబడి కొంటారు.. ఎందుకంటే అందులో మనసుకు నచ్చే నాణ్యమైన, ఆకర్షణీయమైన వస్తువులు దొరుగుతాయని ప్రజల నమ్మకం.. కానీ జనాలను ఇట్టే ఆకర్షిస్తున్న సూపర్ మార్కెట్ల తళుకుమనే వస్తువులు అన్నీపై పై పూతలేనని తేలిపోయింది. అందులో వస్తువులు కొని ఇంటికెళ్లి చూస్తే పాడైపోయి.. సగం కుళ్లి పోయి కనిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని చందానగర్ విజేత సూపర్ మార్కెట్ లో జరిగింది.

చందానగర్ విజేత సూపర్ మార్కెట్ లో ఓ వినియోగదారుడు గౌర్ మెట్ కార్ఫ్ కంపెనీకి చెందిన ఆలూ పరోటా కొనుగోలు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల  ప్రకారం.. ఇంటికి వెళ్లి పరోటా తినేందుకు దాని ఓపెన్ చేయగానే.. అది పూర్తిగా నల్లటి బూజుపట్టి, చెడు వాసన వెదజల్లుతుంది. అలా ఒకటి కాదు, ఆ ప్యాకెట్ లోని మిగతా అన్ని పరోటాలు కూడా పూర్తిగా కుళ్లిపోయాయి. 

నిర్లక్ష్యపు సమాధానాలు

ఇదే విషయాన్ని ఉదయమే విజేత సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ దాట వేసేందుకు ప్రయత్నించారు. పరోటా ప్యాకెట్ల లోకి తొంగి చూడలేము కదా అంటూ లాజిక్ మాట్లాడిన మిగతా అన్ని పరోటా ప్యాకెట్లలో కూడా బూజు ఉన్నట్టు గమనించిన సిబ్బంది వాటిని వెంటనే స్టోర్ నుండి తొలగించారు. 

సూపర్ మార్కెట్ లో కేవలం ఈ పరోటా ప్యాకెట్లు మాత్రమే కాకుండా పపాయా, ఆపిల్, అరటి పళ్లు, వంకాయలు అన్నీ కూడా పాడై పోయాయి. ఇవేంటి ఇవన్నీ పైనే కనిపిస్తున్నాయి కదా అని అడిగితే మా సిబ్బంది కొత్తగా వచ్చారని, వారికి అవగాహన లేదని మేనేజర్ సమాధానం ఇచ్చాడట.

ఫుడ్ సేఫ్టీ నిర్లక్ష్యం..

పరోటాతో పాటు మిగతా కూరగాయలు, పళ్లు కూడా కుళ్లిపోయాయని ఫుడ్ సేఫ్టీ అధికారులకు, చందానగర్ సర్కిల్ ఏఎంహెచ్ ఓ డాక్టర్ కార్తీక్ కు ఫిర్యాదు చేయగా తమ సిబ్బందిని పంపి చెక్ చేయిస్తానని, ఇప్పుడే పంపుతున్నామని చెప్పినా గంటల సమయం గడిచినా విజేత స్టోర్ కు ఏ అధికారి రాలేదు. కనీసం ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం అధికారుల వైఖరికి అద్దం పడుతుంది.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరారు.