వికారాబాద్​- పర్లి రూట్​.. ప్రైవేట్​కు

వికారాబాద్​- పర్లి రూట్​.. ప్రైవేట్​కు
  • మెయింటెనెన్స్​కు ఇవ్వనున్న రైల్వే
  • తర్వాత గుల్బార్గా – బీదర్ 
  • సిబ్బంది ఖర్చు తగ్గుతుందన్న భావనలో రైల్వే
  • బదిలీ చేస్తరేమోనన్న భయంలో ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వికారాబాద్-– పర్లి రూట్ ప్రైవేట్ కానుంది. ఈ మార్గంలోని ట్రాక్ మెయింటెనెన్స్ మొత్తం కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. బీదర్ – గుల్బర్గా రూట్ కూడా ప్రైవేట్​కు ఇవ్వనున్నారు. మొత్తం 378 కిలోమీటర్ల దూరానికి గల ట్రాక్ నిర్వహణను 15 ఏండ్ల పాటు కాంట్రాక్టుకు ఇవ్వనున్నారు. కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ట్రాక్​కు సంబంధించి ప్రతి విషయం కాంట్రాక్టరే చూసుకోనున్నారు. సేఫ్టీ మొదలుకొని రైల్వే ట్రాక్ నిర్మాణం, ట్రాక్ రెన్యువల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు, ప్రొవైడింగ్ ఆపరేషన్, ట్రాక్షన్ తదితర పనులన్నింటినీ మెయింటేన్ చేస్తారు. 
 

15 ఏండ్లపాటు కాంట్రాక్ట్
ప్రస్తుతం ఈ రూట్లు ఆర్వీఎన్ఎల్ (రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్)కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్లు వేరే వ్యక్తులకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారని తెలుస్తోంది. ట్రాక్ నిర్వహణ చేసినందుకు గాను కాంట్రాక్టర్​కు రైల్వే డబ్బులు చెల్లిస్తుంది. ఈ రూట్లలో 15 ఏండ్లకు రూ.470 కోట్ల దాకా చెల్లించేందుకు సానుకూలంగా ఉంది. అంటే ఏడాదికి రూ.31.33 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉంది. లోయెస్ట్ బిడ్ వేసినోళ్లకు కాంట్రాక్టు అప్పగిస్తారు. గుంతకల్ డివిజన్​లోనూ ఓ రూట్​ను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. 
 

తగ్గనున్న ఉద్యోగుల ఖర్చు
వికారాబాద్–పర్లి రూట్లో జహీరాబాద్, హుమ్నాబాద్, ఒద్గూర్, పర్లి స్టేషన్లు ఉన్నాయి. ఇది తెలంగాణ, మహారాష్ట్రలో ఉండగా, బీదర్–గుల్బర్గా కర్నాటక రాష్ట్రంలో ఉంది. ట్రాక్ నిర్వహణ కాంట్రాక్టుకు ఇవ్వనుండటంతో అంతా ప్రైవేట్ వ్యక్తులే మెయింటేన్ చేయనున్నారు. గ్యాంగ్​మెన్, సిగ్నలింగ్, కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో కొత్తవారు రానున్నరు. దీంతో ఇప్పుడు పనిచేస్తున్న రైల్వే స్టాఫ్​ను ఖాళీగా ఉన్న ఇతర ప్రాంతాలకు, వేరే జోన్లకు బదిలీ చేయనున్నారు. దీంతో ఉద్యోగుల ఖర్చు తగ్గతుందని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఈ రూట్లలో సుమారు 800 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు యూనియన్ లీడర్లు చెప్తున్నారు. రైల్వే రూట్లను ప్రైవేట్​కు అప్పగిస్తరన్న సమాచారం తెలియడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒక జోన్ నుంచి, ఇంకో జోన్​కు లేదా వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తదేమోనని పరేషాన్ అయితున్నరు.