పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని ఫర్నేస్ ఒక్కసారిగా పేలడంతో చుట్టుపక్కల గ్రామాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరి ఫ్యాక్టరీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. పేలుడుకు గల కారణాలను ఫ్యాక్టరీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు.
