- అల్లుడికి సహకరించిన కూతురు
- గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు
వికారాబాద్, వెలుగు: ఆస్తి రాసివ్వట్లేదన్న కోపంతో అల్లుడు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణానికి కన్న కూతురే సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన కమ్మరి కృష్ణ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూతురు అనితను కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చిత్తాపూర్‌కు చెందిన అర్జున్ పవార్‌కు ఇచ్చి వివాహం చేశాడు. కృష్ణ పేరిట ఉన్న రెండెకరాల పొలంతో పాటు ఇంటిని తమకు రాసివ్వాలని అల్లుడు కొన్నాళ్లుగా గొడవ చేస్తున్నాడు.
గురువారం ఇదే విషయమై మామా అల్లుడి మధ్య మాటామాటా పెరిగింది. అర్జున్ పవార్.. మామ కృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతనికి భార్య అనిత కూడా సహకరించింది. 25 శాతం కాలిన గాయాలతో కృష్ణ తాండూరు ప్రభుత్వ దవాఖానలో చేరగా, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. అర్జున్, అనితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాలాల ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.
