అణ్వాయుధ బెదిరింపులు రాలేదు: పార్లమెంటరీ కమిటీకి మిస్రీ వివరణ

అణ్వాయుధ బెదిరింపులు రాలేదు: పార్లమెంటరీ కమిటీకి మిస్రీ వివరణ

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‎తో నెలకొన్న ఘర్షణ సమయంలో అణ్వాయుధ దాడికి సంబంధించి ఎలాంటి సంకేతాలు అందలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. దీనిపై సోమవారం పార్లమెంటరీ కమిటీకి ఆయన వివరణ ఇచ్చారు. సైనిక ఘర్షణ పూర్తిగా సంప్రదాయ యుద్ధ రీతిలోనే జరిగిందని తెలిపారు. ఈమేరకు సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీవ్ శుక్లా, దీపేందర్ హుడా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్​ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీకి చెందిన అపరాజిత సారంగి, అరుణ్ గోవిల్ పాల్గొన్నారు. ఈ ఘర్షణ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చైనా మిసైళ్లను, తుర్కియే డ్రోన్లను మనపై ప్రయోగించిందని చెప్పారు. అయితే, మన బలగాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని గాలిలోనే పేల్చేశాయని తేల్చిచెప్పారు. అదేవిధంగా కాల్పుల విరమణ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ 
ట్రంప్ పాత్ర ఏమీలేదని మిస్రీ క్లారిటీ ఇచ్చారు.