- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, అందుకే అధికార పార్టీలో చేరితే కలిసి అభివృద్ధి చేసుకోవచ్చని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట మండలం కంఠంగూడెం గ్రామంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన కమటం స్వరూప కృష్ణస్వామి సోమవారం యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పబ్బం గడిపిందే తప్ప పేదోళ్లకి ఒక్క పక్కా ఇల్లు కట్టించలేదన్నారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరక ప్రజలు నష్టపోయారన్నారు. పదేళ్లు గ్రామాలను పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో అభివృద్ధి తిరిగి మొదలైందని, రెండేళ్ల నుంచి గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కంఠంగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ స్వరూపను ఆయన అభినందించారు. సర్పంచ్ స్వరూపను ఆదర్శంగా తీసుకుని గ్రామాల అభివృద్ధి కోసం మిగతా గ్రామాల సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరాలన్నారు. కార్యక్రమంలో కంఠంగూడెం మాజీ సర్పంచ్ శ్రీరాములు, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
