గుడ్డేలుగును కొట్టి చంపిన గ్రామస్తులు

గుడ్డేలుగును కొట్టి చంపిన గ్రామస్తులు
  • అంతకుముందు గ్రామస్తులపై దాడి
  • ముగ్గురికి గాయాలు.. ఒకరు సీరియస్

పిట్లం, వెలుగు: మండుతున్న ఎండలకు అడవిలో నీళ్లు దొరకక జనావాసాల్లోకి వచ్చిన ఓ గుడ్డేలుగును ప్రజలు కొట్టి చంపేశారు. మద్నూర్ ​మండలం అవల్గాం కొండ మీద నుంచి గుడ్డేలుగు ఊళ్లోకి వచ్చింది. కనిపించిన వారిపై దాడి చేయడంతో రాజన్న, పండరీ గౌడ్​, బలిరాంలు గాయపడ్డారు. ఇందులో రాజన్న తలకు బలమైన దెబ్బలు తగలడంతో ఆయన పరిస్థితి సీరియస్​గా ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆయనను మద్నూర్​కు, అక్కడ నుంచి మహారాష్ట్రలోని దెగ్లూర్ ​ఆస్పత్రికి తరలించారు. రాజన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న విషయం తెలిసి గ్రామస్తులు గుడ్డేలుగును రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత దాన్ని పూడ్చిపెట్టారు. విషయం తెలిసి మద్నూర్​అటవీ సెక్షన్​ఆఫీసర్‌ అనిల్​కుమార్, ఎస్సై సాజిద్​అవల్గాం వచ్చి పూడ్చిపెట్టిన ఎలుగును బయటకు తీశారు. పశు వైద్యాధికారి విజయ్​పరిశీలించి పోస్ట్​మార్టంకోసం మద్నూర్‌కు తరలించారు.