సర్కారు స్కూల్ ను బతికించారు

సర్కారు స్కూల్ ను బతికించారు
  • గ్రామంలోనే చదివించాలె
  • కన్నాపూర్ గ్రామస్తుల తీర్మానం

జగిత్యాల రూరల్, వెలుగు: మూతపడుతున్న సర్కారు  స్కూల్ ని బతికించుకునేందుకు ఆ గ్రామస్తులు నడుం కట్టారు. ఈ ఏడాది మూతపడాల్సిన స్కూల్​కు ఊరంతా కలిసి జీవం పోశారు. ఊళ్లో పిల్లలను సర్కారు స్కూళ్లోనే చదివించాలని శుక్రవారం గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. ఎవరైనా ప్రైవేట్ స్కూల్​కు పంపింతే పంచాయతీ తరఫున ఇచ్చే ధ్రువపత్రాలను సైతం ఇవ్వమని నోటీసులు అంటించారు. గ్రామ పంచాయతీ తీర్మానంతో మూతపడే స్కూల్​ ఇప్పుడు కళకళలాడుతోంది. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం కన్నాపూర్ ​గ్రామంలో ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఆరుగురు టీచర్లు, కేవలం ఐదుగురు స్టూడెంట్స్​ మాత్రమే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం స్కూల్​ మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులంతా ఏకమై గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకున్నారు. ఊళ్లో పిల్లలను ఊళ్లోనే చదివించాలని నిర్ణయించారు. ఐదుగురు స్టూడెంట్స్​ఉన్న స్కూళ్లో  ఇప్పుడు 40 మంది చేరారు. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి మరింత మందిని చేర్పిస్తున్నారు.

మరింత మందిని చేర్పిస్తాం

స్కూళ్లల్లో స్టూడెంట్స్​ లేకపోవడంతో స్కూల్స్​ మూసి వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది స్టూడెంట్స్​ని  తీర్చిదిద్దిన స్కూల్​  మూతపడే పరిస్థితి వచ్చింది.  గ్రామస్తులంతా కలిసి ఎలాగైన పిల్లలందరిని సర్కార్​స్కూళ్లో చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. మరింత మందిని చేర్పించేందుకు కృషి చేస్తున్నాం. – సుధాకర్, సర్పంచ్, కన్నాపూర్, జగిత్యాల రూరల్​మండలం.