ఊరచెరువు బాగు కోసం కదిలిన కాలనీలు..వరంగల్ నగరంలోని గోపాలపూర్ చెరువు పరిరక్షణకు పోరుబాట

ఊరచెరువు బాగు కోసం కదిలిన కాలనీలు..వరంగల్ నగరంలోని గోపాలపూర్ చెరువు పరిరక్షణకు పోరుబాట
  • ముంపు సమస్య పరిష్కారానికి జేఏసీ ఏర్పాటు
  • ఇటీవల చెరువు కట్ట తెగి మునిగిపోయిన కాలనీలు
  • ఇండ్లు వదిలి వెళ్లిపోయిన జనాలు

హనుమకొండ, వెలుగు:  ఇటీవల మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. ముఖ్యంగా హనుమకొండలోని కాకతీయులు నిర్మించిన గోపాలపూర్ ఊరచెరువు కట్ట కోతకు గురై వరద నీళ్లు చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తాయి. దీంతో కొందరు ఇండ్లు వదిలి వెళ్లిపోతే.. ఉన్న వారు ఇండ్ల చుట్టూ నీళ్లు చేరి బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

 భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో గోపాలపూర్ ఊరచెరువు ప్రభావిత కాలనీల ప్రజలంతా ఒక్కటయ్యారు. ముంపు సమస్యను పరిష్కరించడంతో పాటు కబ్జాకు గురైన చెరువును పరిరక్షించాలనే డిమాండ్ తో జేఏసీగా ఏర్పడి పోరుబాటకు రెడీ అయ్యారు.

కబ్జా చెరలో చెరువు..

కాకతీయుల కాలంలో వరంగల్​ నగరం చుట్టూ 280కుపైగా గొలుసుకట్టు చెరువులు నిర్మించగా.. అందులో హనుమకొండలోని గోపాలపూర్ ఊరచెరువు ఒకటి. కాకతీయ యూనివర్సిటీ -కాజీపేట ఫాతిమానగర్ వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉండటం వల్ల ఇక్కడ గజం భూమి విలువ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. దీంతో గత ప్రభుత్వ హయాంలో చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. 

రెవెన్యూ రికార్డుల్లో గోపాలపూర్ ఊర చెరువు 20.01 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం అందులో సగానిపైగా ఆక్రమణకు గురైంది. ఆక్రమణలను తొలగించి చెరువును సుందరీకరించాలని ఎన్నో పోరాటాలు నిర్వహించినా పాలకులు పట్టించుకోలేదు.

నిత్యం కోతకు గురవుతూ..

గోపాలపూర్ చెరువు చాలావరకు కబ్జాకు గురి కావడం, పూడిక, గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో నిండిపోవడంతో కొద్దిపాటి వరద వచ్చినా చెరువు మొత్తం నిండిపోతోంది. 2016 నుంచి ఇప్పటివరకు చెరువు కట్ట నాలుగు సార్లు కోతకు గురైంది. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవగా.. పైనుంచి వచ్చిన వరదతో ఈ చెరువు నిండుకుండలా మారింది. వరదను బయటకు పంపేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కండక్ట్ నిర్మించినా.. దాని గేట్లలో చెత్తాచెదారం అడ్డుగా తగిలి వరద వంద ఫీట్ల రోడ్డుపై నుంచి పరుగులు తీసింది. 

చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తింది. దీంతో అమరావతి నగర్, వివేక్ నగర్, ప్రగతినగర్, సమ్మయ్యనగర్, గాంధీనగర్, కుడా కాలనీ, ఇంజినీర్స్ కాలనీ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్ల నిండా నీళ్లు చేరడంతో ఆయా కాలనీల వాసులు బిల్డింగులు ఎక్కి ప్రాణాలు కాపాడుకోగా.. కొందరు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలు, బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు. 

ముంపు విముక్తి కోసం ఉద్యమం..

మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ నగరంలో 6,475కు పైగా ఇండ్లు దెబ్బతినగా.. అందులో సగం హనుమకొండ గోపాలపూర్ ఊర చెరువు కిందనే ఉన్నాయి. తరచూ భారీ వర్షాలు పడినప్పుడల్లా ముంపు భయం వేధిస్తుండటం, మరోవైపు చెరువు కట్ట బలహీన పడటం, మినీ ట్యాంక్ బండ్ గా డెవలప్ మెంట్ మాటలకే పరిమితం కావడంతో తాజాగా ఇక్కడి వివిధ కాలనీల వాసులంతా ఉద్యమానికి రెడీ అయ్యారు. చెరువు కట్ట బలోపేతం, రిటైనింగ్ వాల్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి వంటి డిమాండ్లతో పోరుకు సిద్ధమయ్యారు. 

నాలుగు రోజుల క్రితం వంద ఫీట్ల రోడ్డుపై ఆందోళన కూడా చేపట్టారు. ఆ తరువాత డెమోక్రటిక్ థాట్స్ ఫోరం అధ్యక్షుడు తుపాకుల దశరథం, నల్లాని శ్రీనివాస్, మీసాల రమేశ్, మర్రి ప్రభాకర్, పింగిళి అశోక్ రెడ్డి, పల్ల రమణారెడ్డి ఆధ్వర్యంలో వరద బాధిత కాలనీల ప్రజలు, విద్యావంతులు, మేథావులు, వివిధ సంఘాల నేతలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. 

ముంపు సమస్య పరిష్కారమే లక్ష్యం

గోపాలపూర్ ఊర చెరువును పరిరక్షించాలనే డిమాండ్ తో కొంతకాలంగా పోరాటం చేస్తున్నాం. ఇదివరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు లేఖలు అందజేశాం. ఇప్పుడు ముంపు కాలనీల బాధితులందరితో కలిసి జేఏసీ ఏర్పాటు చేశాం. గోపాలపూర్ ఊర చెరువు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు చుట్టుపక్కల కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టాలనేదే మా ప్రధాన డిమాండ్. చెరువును కాపాడి టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయాలి.– తుపాకుల దశరథం, జేఏసీ కన్వీనర్