ఆడోళ్లను వేధిస్తే వెలి.. గ్రామస్తుల తీర్మానం

ఆడోళ్లను వేధిస్తే వెలి.. గ్రామస్తుల తీర్మానం

కరీంనగర్​ జిల్లా చిన్నపాపయ్యపల్లి గ్రామస్తుల తీర్మానం

హుజూరాబాద్​, వెలుగు:  ఈ మధ్య కాలంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక చోట ఒక్క ఘటనైనా జరుగుతోంది. అందుకే కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మండలం లోని చిన్నపాపయ్యపల్లి ఊరోళ్లు ఓ మంచి పని చేస్తున్నారు. ‘‘మా ఊళ్ల పోకిరీలకు చోటు లేదు. మహిళలు, ఆడపిల్లలను వేధించే వారిని రానియ్యం” అంటూ తీర్మానం చేశారు. అదొక్కటే కాదు, గ్రామాన్ని పట్టిపీడిస్తున్న ఇతర సమస్యలపైనా తీర్మానాలు చేశారు.

మంగళవారం గ్రామపంచాయతీ ఆఫీసులో స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఊరోళ్లంతా కలిసి వాటికి ఓకే చెప్పారు. తీర్మానాల్లో భాగంగా మందు అమ్మడం, తాగడం బంద్​పెడుతున్నారు. ఆడోళ్లపై అఘాయిత్యాలకు ఒడిగడితే ఊరి నుంచి వెలివేస్తారు. అలాగే పర్యావరణాన్ని రక్షించేందుకు తమవంతు బాధ్యతగా మట్టి గణపతులను పూజిస్తామని ఇంకో తీర్మానం చేశారు.

ప్రజల మద్దతు తప్పనిసరి

ఇటీవల బాలికలు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. తాగుడు వల్ల చాలా   కుటుంబాలు చితికిపోతున్నాయి. పర్యావరణం పాడవుతోంది. ఆ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ తీర్మానాలు చేశాం. స్పందన సేవా సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. ప్రజల మద్దుతుంటేనే తీర్మానాలన్నీ అమలవుతాయి. ‑ గీసీడీ దేవేంద్ర, సర్పంచ్​, చిన్నపాపయ్యపల్లి.