
- ఇంగ్లిష్ మీడియం చదువు, డిజిటల్ క్లాస్‌లు
- ఆటపాటల్లోనూ శిక్షణ
కామారెడ్డి, వెలుగు : పల్లెల్లో బడుల బాగు కోసం గ్రామస్తులు చేతులు కలిపారు. చందాలు వేసుకోవడంతోపాటు పూర్వ విద్యార్థులు సహకారంతో సర్కారు బడుల రూపు రేఖలు మారుస్తున్నారు. పాల్వంచ మండలంలోని ఫరీద్‌పేట్, రాజంపేట మండలం శివాయిపల్లి, ఆరేపల్లి, కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లిల్లో సర్కారు బడులు కొత్తకళ సంతరించుకున్నాయి.
శివాయిపల్లిలో మూతపడ్డ బడి ప్రారంభం..
2012లో మూతపడిన రాజంపేట మండలంలోని శివాయిపల్లి ప్రైమరీ స్కూల్ 2019లో తిరిగి ప్రారంభమైంది. గ్రామస్తులు రూ. 6 లక్షలు చందాలు వేసుకుని అదనపు గదులకు స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిధులు రూ.50 లక్షలు రావడంతో అడిషనల్క్లాస్ రూమ్స్, టాయిలెట్లను నిర్మించారు. డిప్యూటేషన్‌పై ఇద్దరు టీచర్లను ఇవ్వగా, వలంటీర్లను నియమించుకున్నారు.
ఫదీద్పేట గ్రామంలో..
పాల్వంచ మండలం ఫరీద్పేటలోని హైస్కూల్, ప్రైమరీ స్కూల్ రూపు రేఖలు మారాయి. కంపౌండ్ వాల్, రంగులు, ఇతర వసతుల కోసం ప్రభుత్వం రూ. 80 లక్షల ఫండ్స్ కేటాయించింది. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు రూ. 20 లక్షల వరకు విరాళాలు సేకరించారు. చుట్టూ సోలార్ పెన్సింగ్, గ్రౌండ్లో సొలార్ లైట్లు, సీసీ కెమెరాలు బిగించారు. టాయిలెట్లను నిర్మిస్తున్నారు. గ్రౌండ్లో మొరం పోయించి క్లీన్ చేశారు. బాస్కెట్‌బాల్ కోసం కోర్ట్ నిర్మాణం చేస్తున్నారు. ఐఐటీ, ఇతర పోటి పరీక్షలకు బోధకులను నియమించి శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ బోధన కోసం ఇన్స్ర్టక్టర్ ను ఏర్పాటు చేశారు.
23 మంది నుంచి 136 మందికి చేరిన క్యాసంపల్లి స్కూల్
రెండేండ్ల కింద 23 మంది విద్యార్థులు ఉన్న కామారెడ్డి మండలం క్యాసంపల్లి ప్రైమరీ బడిలో ఇప్పుడు 136 మంది విద్యార్థులకు చేరింది. ప్రైవేట్ స్కూల్స్ మాన్పించి సర్కారు బడికి పంపిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గితే బడి మూతపడుతుందని గ్రామ యువకులు బడి బాగుకు ముందుకొచ్చారు. గ్రామస్తులతో పాటు, దాతలు సుభాష్‌రెడ్డి, పైడి ఎల్లారెడ్డి ఇతరులతో కలిసి రూ. 3 లక్షలు జమ చేశారు. శిథిలమైన క్లాస్ రూమ్స్ తొలగించి రేకుల షెడ్లు వేశారు.
స్కూల్ బిల్డింగ్ కట్టించి.. విద్యార్థుల బాధలు తీర్చి
బీబీపేట మండలం జనగామలో ఇదే ఊరికి చెందిన వ్యాపార వేత్త వేణుగోపాల్‌రెడ్డి రూ. కోటి వరకు ఖర్చు చేసి 14 క్లాస్ రూమ్స్‌తో స్కూల్ బిల్డింగ్ నిర్మించారు. ప్రైమరీ స్కూల్‌ను హైస్కూల్‌గా మార్చారు. ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారు.
నాణ్యమైన బోధనతో పక్క గ్రామాల నుంచి..
రాజంపేట మండలం ఆరేపల్లిలో ని యూపీఎస్ స్కూల్ ఇప్పుడు హైస్కూల్‌గా మారింది. స్థానికుడు శ్యాంరావు రూమ్స్ రిపేర్‌తో పాటు రంగులు వేయించారు. మూడేండ్లుగా వలంటీర్లను నియమించి జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం 224 మంది విద్యార్థులు ఉన్నారు. వలంటీర్లకు ప్రతి నెలా రూ. 50వేలు చెల్లిస్తున్నట్లు శ్యాంరావు
చెప్పారు.
కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డిలో..
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో పూర్వ విద్యార్థులు రూ. 15 లక్షల వరకు పొగు చేసి గర్ల్స్ హైస్కూల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న టీచర్లు కూడా రూ.75 వేల విరాళం ఇచ్చారు.