నుడా పరిధిలో ..  పర్మిషన్​ల కిరికిరి

నుడా పరిధిలో ..  పర్మిషన్​ల కిరికిరి
  • ఆన్​లైన్​లో విలేజ్​లు గాయబ్​
  • నగరం చుట్టూ అక్రమ నిర్మాణాలు 
  • ట్యాక్స్ పేమెంట్​లు అయోమయం 

నిజామాబాద్​,  వెలుగు:  సిటీ చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిలో అర్బన్​ ప్లాన్​ అమలు కోసం ఏర్పాటు చేసిన 'నుడా' (నిజామాబాద్​ అర్బన్​ డెవలెప్​మెంట్​ అథారిటీ) నుంచి శివారు గ్రామాల్లోని ఇండ్లు, ఇతర నిర్మాణాలకు పర్మిషన్లు వస్తలేవు. నుడా ఆన్​లైన్​ సైట్ లో​  గ్రామాల వివరాలు ఐదు నెలల కింద మాయం కావడమే ఇందుకు కారణం.  దీంతో నగర శివారులో అక్రమ నిర్మాణాల సంఖ్య పెరుగుతండగా మరోపక్క  ఇన్​కమ్ కోల్పోతున్నాయి. 

నగర విస్తరణ కాన్సెప్ట్​తో..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​లో 60 డివిజన్​లు ఉన్నాయి. కొత్త కాలనీలతో ఏటా నగరం విస్తరిస్తున్నది. ఈ స్పీడ్​ అనూహ్యంగా పెరగడంతో సిటీకి 6 కిలోమీటర్ల పరిధిలో డెవలప్​ మెంట్​ చేసేందుకు 2017 మే లో నుడా ఏర్పాటు చేశారు.  డిచ్​పల్లి, మాక్లూర్, మోస్రా, ముప్కాల్, నవీపేట, నిజామాబాద్​రూరల్, రెంజల్, ఎడపల్లి మండలాల్లోని 88 గ్రామాలను నుడా కింద చేర్చారు.  చైర్మన్​ను గవర్నమెంటు నామినేట్​ చేయగా మున్సిపల్ కమిషనర్​ నుడాకు వైస్​చైర్మన్​గా వ్యవహరిస్తారు. ​ 

టీఎస్​బీ పాస్​ అనుమతులు

గ్రామ పంచాయతీల్లో ఇండ్ల నిర్మాణ అనుమతులు ఈ- పంచాయతీ ద్వారా లభిస్తాయి. పర్మిషన్​ ఫీజు నిర్మాణం పూర్తయిన ఇంటి నుంచి ట్యాక్స్​ పంచాయతీయే తీసుకుంటుంది. నుడా పరిధిలోకి మారిన విలేజ్​లు గ్రామ పాలన కిందే ఉన్నా ఇండ్ల నిర్మాణ పర్మిషన్లు మాత్రం టీఎస్​బీపాస్​ ద్వారా నుడా ఉంచిపొందాల్సి ఉంటుంది.   స్థలం డాక్యుమెంట్లు, బిల్డింగ్​ మ్యాప్​ తదితర వివరాలతో ఆన్​లైన్​లో దరఖాస్తు చేశాక మున్సిపల్​ టౌన్​ ప్లానింగ్​ శాఖ ఆమోదంతో పర్మిషన్లు ఇస్తారు. అయితే మార్చి నుంచి టీఎస్​బీపాస్​ సైట్​లో నుడా విలేజ్​ల వివరాలు గాయబ్​ అయ్యాయి. ఏ అప్లికేషన్​ కూడా అప్​లోడ్​ కావడం లేదు.  దీంతో ఎవరికి వారు పర్మిషన్లు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. 

ఎదురుచూసే ఓపికలేక పనులు షురూ

ఎలాగూ ఆన్​లైన్​ పనిచేస్తలేదని ఇంకా ఎదురు చూసే ఓపికలేక నిర్మాణాలు స్టార్ట్​ చేస్తున్నారు. రూరల్​లోని మొత్తం 20 గ్రామాలతో పాటు మాక్లూర్,  డిచ్​పల్లిలో ఇండ్లతో పాటు కమర్షియల్ కాంప్లెక్సులను నిర్మిస్తున్నారు. నిర్ణీత విధానంలో పనులు జరుగుతున్నాయా లేదా అని చూసే వారు లేరు. మరోవైపు పర్మిషన్​ ఫీజు,  ట్యాక్స్ ఇన్​కమ్​కు నష్టం కలుగుతుంది.   

మేమేం చేయలేం

నుడా పరిధిలోని విలేజ్​ల్లో నిర్మాణ పర్మిషన్లు,  ట్యాక్స్​లకు గ్రామ పంచాయతీలతో  సంబంధంలేదు. నిర్ణీత సైట్​లో అప్లికేషన్లు పెట్టుకొని అనుమతులు పొందాలి. మా పరిధిలో లేని అక్రమ నిర్మాణాల గురించి ఏమీ మాట్లాడలేం.    

జయసుధ, డీపీవో